ఆర్టీసీ సమ్మె: హైకోర్టు చివరి ప్రయత్నం..

13 Nov, 2019 01:42 IST|Sakshi

ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి సుప్రీం మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తాం

మీ వైఖరి ఏమిటో చెప్పండి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సమస్య పరిష్కారమవుతుందని ఆశించాం.. కానీ ఎవరూ తగ్గడం లేదు..

మా మాటకు, విశ్వాసానికి ప్రభుత్వం గౌరవం ఇవ్వలేదు

లేబర్‌ కోర్టు మాట వింటుందన్న నమ్మకం కూడా లేదు

కమిటీ ఏర్పాటు తర్వాత విజ్ఞప్తులు ఉండవ్‌.. ఆదేశాలే ఉంటాయ్‌

హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ.. విచారణ నేటికి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌ : ‘సమస్య పరిష్కారమవు తుందని ఆశించాం. నిన్నటి వరకు ఓ మూలన చిన్న ఆశ ఉండేది. కానీ ఎవరూ తగ్గడంలేదు. ఈ పరిస్థితుల్లో సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం 0.001 శాతం కూడా మాకు లేదు. మా మాటకు, మా విశ్వాసానికి ప్రభుత్వం గౌరవం ఇవ్వలేదు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం భవి ష్యత్తులో లేబర్‌ కోర్టు మాట వింటుం దన్న నమ్మకం కూడా మాకు లేదు. అయినా మా చివరి ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక సంఘాలు, ఆర్టీసీ యాజమాన్యాన్ని చర్చల టేబుల్‌ వద్దకు తీసుకొస్తు న్నాం. ఇందుకోసం ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తాం. వీరు వివిధ అంశాల్లో ఎంతో అనుభవం కలిగిన వారు. అత్యున్నత న్యాయ స్థానంలో రాజ్యాంగ హోదాలో పని చేశారు. ప్రభుత్వం కనీసం వీరి మాటైనా వింటుందని ఆశిస్తున్నాం. మా వైపు నుంచి చేస్తున్న చివరి ప్రయ త్నం ఇదే. ఈ కమిటీ ఏర్పాటు విష యంలో మీ వైఖరి ఏమిటో రేపటికల్లా చెప్పండి’అని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయ మూర్తి జస్టిస్‌ అన్నిరెడ్డి అభిషేక్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వు లిచ్చింది. కమిటీ ఏర్పాటైన తర్వాత వారం రోజుల గడువిచ్చి, కమిటీ ముందు హాజరుకావాల్సిందిగా ఇరు పక్షాలకు ఆదేశాలిస్తామని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఇకపై విజ్ఞప్తులు ఏమీ ఉండవని, కేవలం ఆదేశాలు మాత్రమే జారీ చేస్తుంటామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తే సమ్మె కొనసాగించే విషయంపై పునరాలోచన చేస్తామని కార్మిక సంఘాలు హైకోర్టుకు నివేదించాయి. హైకోర్టులో తాజాగా చోటు చేసుకున్న ఈ ఆసక్తికరమైన పరిణామాల నేపథ్యంలో.. బంతి మళ్లీ రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోకి వెళ్లింది. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సీజే నేతత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

ఏపీఎస్‌ ఆర్టీసీ జీవో టీఎస్‌ ఆర్టీసీకి ఎలా వర్తిస్తుంది?
ఈ సందర్భంగా ఈ కేసులో కోర్టు సహాయకారిగా (అమికస్‌ క్యూరీ)గా వ్యవహరిస్తున్న సీనియర్‌ న్యాయవాది జి.విద్యాసాగర్‌ స్పందిస్తూ.. కార్మికుల సమ్మె చట్టబద్ధతపై హైకోర్టు తేల్చజాలదని, లేబర్‌ కోర్టు మాత్రమే ఈ విషయాన్ని తేల్చగలదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఆర్టీసీని అత్యవసర సేవల పరిధిలోకి తీసుకొస్తూ ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో జారీ అయిందని వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఎస్‌ ఆర్టీసీకి ఇచ్చిన జీవోను టీఎస్‌ ఆర్టీసీకి ఎలా వర్తింపజేస్తారని ప్రశ్నించింది. కొత్తగా టీఎస్‌ ఆర్టీసీని ఏర్పాటు చేసుకున్నామని చెబుతున్నప్పుడు, ఏపీఎస్‌ ఆర్టీసీకి ఉద్దేశించిన జీవో టీఎస్‌ ఆర్టీసీకి వర్తించదని తేల్చి చెప్పింది. టీఎస్‌ ఆర్టీసీని ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ జీవో చేసి ఉండొచ్చునని, అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ పని చేయలేదంది.

విద్యాసాగర్‌ తన వాదనలను కొనసాగిస్తూ.. పారిశ్రామిక వివాదాల చట్టం కింద ప్రభుత్వం ఈ వివాదాన్ని రాజీ (కన్సిలియేషన్‌)కి తీసుకెళ్లిందని, అయితే అది విఫలం కావడంతో కన్సిలియేషన్‌ అధికారి తన నివేదికను ప్రభుత్వానికి పంపారని తెలిపారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ, కన్సిలియేషన్‌ అధికారి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక వివాదాల చట్టం కింద లేబర్‌ కోర్టుకు నివేదించాలని, అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ పని చేయలేదని, బంతి ఇంకా ప్రభుత్వ కోర్టులోనే ఉందని వ్యాఖ్యానించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరు ఆర్టీసీ బస్సుల్లో సేవా లోపాల గురించి ప్రస్తావించారు. ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్న డబ్బును కండక్టర్లు ఆర్టీసీకి జమ చేయకుండా దుర్వినియోగం చేస్తున్నారని వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. తాము సమ్మె చట్టబద్ధమా? కాదా? అన్న విషయాన్నే తేలుస్తామని తేల్చి చెప్పింది. ఆర్టీసీ అందిస్తున్న సేవల్లో లోపాలుంటే వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాలని స్పష్టం చేసింది.

ప్రభుత్వం చర్చలు జరపాలన్న నిబంధన లేదు...
చర్చలు జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని మరో న్యాయవాది కోరగా.. సమ్మె చేస్తున్న వారితో ప్రభుత్వం చర్చలు జరపాలని ఏ చట్ట నిబంధనలు చెబుతున్నాయని ధర్మాసనం ప్రశ్నించింది. పారిశ్రామిక వివాదాల చట్ట నిబంధనల్లో అటువంటి నిబంధన ఏదీ లేదంది. చట్టంలో లేని పనిని చేయాలని తామెలా ఆదేశించగలమని ప్రశ్నించింది. కన్సిలియేషన్‌ అధికారి నివేదికను ప్రభుత్వం లేబర్‌ కోర్టుకు నివేదించాలని, ఒకవేళ నివేదించకపోతే ప్రభుత్వం కారణాలు చెప్పాల్సి ఉంటుందని తెలిపింది. కారణాలు చెప్పకపోతే, వాటిని సవాల్‌ చేస్తూ కార్మిక సంఘాలు హైకోర్టుకు రావొచ్చునని, అయితే ఆ దశ ఇంకా రాలేదంది. పారిశ్రామిక వివాదాల చట్టం కింద ముందుకెళ్లకుండా ప్రభుత్వాన్ని ఎవరూ నిరోధించలేరని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కార్మికుల రెచ్చగొట్టేలా ప్రభుత్వం వ్యవహరించింది...
నెల రోజులకు పైగా సమ్మె జరుగుతోందని, ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు నివేదించారు. చర్చలకు ఆహ్వానించాల్సిన ప్రభుత్వం, ఆ పని చేయకుండా కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటన చేసిందన్నారు. అంతేకాకుండా విధుల్లో చేరేందుకు సైతం డెడ్‌లైన్‌ విధించిందని వివరించారు. కార్మిక సంఘాలను రెచ్చగొట్టేలా ప్రభుత్వం వ్యవహరించిందని పేర్కొన్నారు. ఆర్టీసీ యాజమాన్యం కూడా తన కనీస బాధ్యతను నిర్వర్తించలేదన్నారు. ఈ సమయంలో అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ స్పందిస్తూ.. కార్మికుల పట్ల ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించిందని, కమిటీ వేసి చర్చలకు పిలిచిందని వివరించారు. అయితే కార్మిక సంఘాలు కమిటీ మాట వినకుండా సమ్మెకు వెళ్లారని తెలిపారు. కన్సిలియేషన్‌ అధికారి నివేదిక ఇచ్చారని, ఇదే సమయంలో హైకోర్టులో ఈ వ్యాజ్యాలు దాఖలై విచారణ మొదలైందని, దీంతో ఆ అధికారి నివేదిక ప్రకారం ముందుకెళ్లకుండా ఆగిపోయామని చెప్పారు.

ఈ సమయంలో కార్మిక సంఘాల తరఫున సీనియర్‌ న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ.. చట్ట నిబంధనల ప్రకారం ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసే అధికారం హైకోర్టుకు ఉందని వివరించారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే వెళ్లాలని కార్మిక సంఘాలకు చెప్పానని తెలిపారు. కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్లను పరిశీలిస్తే, చర్చలు జరిపే ఉద్దేశమే ఉన్నట్లు కనిపించడంలేదన్నారు. ఈ దశలో ధర్మాసనం స్పందిస్తూ.. సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశ తమకు 0.001 శాతం కూడా లేదంది. ఈ నేపథ్యంలో ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించింది. దీనికి ఏజీ స్పందిస్తూ, ఈ వ్యవహారాన్ని లేబర్‌ కోర్టుకు నివేదించాలని కోరారు. దీనికి ధర్మాసనం ఒకింత ఘాటుగా స్పందించింది. తాము చివరి ప్రయత్నం చేస్తున్నామని, ప్రభుత్వం హైకోర్టు మాటకు ఏ మాత్రం గౌరవం ఇవ్వలేదని వ్యాఖ్యానించింది.

లేబర్‌ కోర్టు మాట వింటారన్న నమ్మకం కూడా లేదని, ఉన్నతస్థాయి వ్యక్తులతో ఏర్పాటు చేసే కమిటీ మాటైనా వింటారని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించింది. ఈ కమిటీ ఏర్పాటు విషయంలో వైఖరి ఏమిటో తెలియచేయాలని ఏజీని ఆదేశించింది. అనంతరం ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ, లేబర్‌ కోర్టుకెళ్లినా అక్కడ కాలయాపన తప్ప ఏమీ ఉండదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీకి ఈ వివాదాన్ని నివేదిస్తే, కార్మిక సంఘాలు సమ్మె విషయంలో పునరాలోచన చేస్తాయని చెప్పారు. అందరి వాదనలు విన్న «ధర్మాసనం.. ప్రభుత్వ స్పందన నిమిత్తం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. మరోవైపు 5,100 బస్సు రూట్ల ప్రైవేటీకరణ నిమిత్తం రాష్ట్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంపై ఇచ్చిన స్టేను హైకోర్టు మరోసారి పొడిగించింది. ఈ వ్యవహారంలో కూడా విచారణను బుధవారానికి వాయిదా వేసింది. 

>
మరిన్ని వార్తలు