కేసీఆర్‌కు భయపడం.. ఫామ్‌హౌజ్‌లో పాలేరులం కాదు

7 Oct, 2019 14:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న ప్రకటనలకు భయపడేది లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. గన్‌పార్క్‌ వద్ద పోలీసుల అరెస్టు చేసిన ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి విడుదలై.. తమ కార్మిక సంఘం కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ తీరుపై మండిపడ్డారు.

ఉద్యమాలతో సీఎం అయి.. ఉద్యమాలను అణిచివేసే సీఎంగా కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. ఆర్టీసీలో కార్మికులు 50 వేల వరకు జీతాలు తీసుకుంటున్నారంటూ.. కేసీఆర్‌ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో పనిచేసే పాలేరులం కాదని ఆయన అన్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల్లో నలుగురిని కూడా డిస్మిస్‌ చేసే పరిస్థితి లేదని, కార్మికుల సమ్మె విజయవంతంగా కొనసాగుతోందరి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. సమ్మె విషయంలో న్యాయ సలహా తీసుకున్నామని, సమ్మె న్యాయబద్ధమేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీతో టీఎస్‌ ఆర్టీసీని పోల్చి మాట్లాడాలని, అంతేకానీ, ఇతర రాష్ట్రాలతో కాదని పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ఎల్లుండి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

అరెస్టు చేసినా.. జైల్లో పెట్టినా..
ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్‌ సర్కారు ఎన్ని హెచ్చరికలు చేసినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు తేల్చి చెప్పారు. తమను అరెస్టు చేసినా, జైల్లో పెట్టినా సమ్మెను ఆపబోమని ఆర్టీసీ జేఏసీ నాయకుడు థామస్‌రెడ్డి స్పష్టం చేశారు. తమ పోరాటానికి రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలన్నీ మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేవరకు సమ్మె విరమించేది లేదని ఆయన తెలిపారు. సమ్మె చేస్తోంది.. కార్మికుల స్వలాభం కోసం కాదు.. ప్రజల కోసం, సంస్థ కోసమేనని ఆర్టీసీ జేఏసీ నేత రాజా అన్నారు. ఆర్టీసీ కార్మికులకు క్రమశిక్షణ లేదంటారా? అని ఆయన సీఎంను ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు మద్దతు ఇచ్చిన విషయాన్ని కేసీఆర్‌ అప్పుడే మరిచిపోయారా? అని అడిగారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టబద్ధమైనదని.. ఆర్టీసీలో తాత్కాలిక నియామకాలు చేపడితే కోర్టు ధిక్కారమే అవుతుందని రాజా అన్నారు.

మరిన్ని వార్తలు