ఆర్టీసీ సమ్మె : గవర్నర్‌ తమిళిసైని కలిసిన జేఏసీ నేతలు

21 Oct, 2019 19:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నాయకులు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను రాజ్‌భవన్‌లో సోమవారం సాయంత్రం కలిశారు. ఆర్టీసీ సమ్మె విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు విఙ్ఞప్తి చేశారు. సమ్మెపై చర్చించాలన్న హైకోర్టు వ్యాఖ్యలు, ప్రభుత్వం చర్చలను ఆహ్వానించకపోవడం, వేతనాలు లేక  కార్మికులు పడుతున్న ఇబ్బందుల్ని ఆమెకు వివరించారు. గవర్నర్‌ను కలిసినవారిలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి, కో కన్వీనర్‌ రాజిరెడ్డి, వీ.ఎస్.రావు తదితరులు ఉన్నారు.

గవర్నర్‌ను కలిసిన అనంతరం అశ్వత్థమారెడ్డి రెడ్డి  మాట్లాడుతూ.. ‘ఆర్టీసీని లాకౌట్ చెయ్యడానికి ఎవ్వరికి అధికారం లేదు. ఆర్టీసీ ఆస్తులు కార్మికుల ఆస్తులు. ఆర్టీసీపై కన్నేసి ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర జరుగుతోంది. లాకౌట్ చేస్తా అంటే భయపడే ప్రస్తకే లేదు. లాకౌట్ చేసేందుకు సీఎం ఎవరు. సమ్మె డిమాండ్లపై నివేదిక ఇచ్చాము. బోర్డ్ అనుమతి లేకుండా సమ్మెలో ఉన్నప్పుడు మళ్ళీ కొత్తగా అద్దె బస్సులకు టెండర్లకు పిలిచారని చెప్పాము. ఆర్టీసీ కార్మికులు దైర్యంగా ఉండాలని గవర్నర్ చెప్పారు. కోర్టు ఆర్డర్ కాపీ అందలేదని ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఎమ్మెల్యేలు ఆర్టీసీ కార్మికులను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. జేఏసీ కార్యాచరణ విజయవంతం అయింది. మా మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు. జూబ్లీ బస్ స్టేషన్ లో రేపు వంటావార్పు కార్యక్రమం ఉంటుంది’అన్నారు.

మరిన్ని వార్తలు