ఆర్టీసీ సమ్మె: కార్మికుల ఉద్యోగాలు ఊడినట్టేనా?

8 Oct, 2019 11:11 IST|Sakshi

నాడు జయలలిత.. నేడు కేసీఆర్‌

సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగించిన తమిళ సర్కార్‌

కోర్టులో ఉద్యోగులకు ఊరట.. తిరిగి విధుల్లోకి

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్‌.. సంస్థలో ఇక మిగిలింది1200 మంది ఉద్యోగులు మాత్రమే అని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం విధించిన గడువులోగా విధుల్లో చేరని వారిని ఇక ఉద్యోగులుగా గుర్తించమని సీఎం ప్రకటించారు. దీంతో ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన మొదలైంది. ఇక తమ ఉద్యోగాలు పోయినట్టేనని కొంతమంది కలవరపడుతున్నారు. ఇదిలావుడంగా సమ్మెపై ప్రభుత్వ ప్రకటనకు భయపడేదిలేదని, ఆందోళనను మరింత  ఉదృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. అయితే ఉద్యోగుల భవిష్యత్తులపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సీఎం ప్రకటనతో సమ్మె చేస్తున్నవారంతా ఉద్యోగాలు కోల్పోయినట్లేనా? కార్పొరేషన్ ఉద్యోగులను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందా? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే గతంలో సమ్మె చేస్తున్న ఉద్యోగులపై తమిళనాడు ప్రభుత్వం కూడా ఇదే విధంగా వ్యవహరించింది.

తమిళనాడులో ఏం జరిగింది..
2003లో జయలలిత సీఎంగా ఉన్న సమయంలో అక్కడి టీచర్లు, రెవెన్యూ ఉద్యోగులు దాదాపు లక్షా 70వేల మంది సమ్మెకు దిగారు. ప్రభుత్వం బుజ్జగించినా వారు దిగిరాకపోవడంతో ఒక్క కలంపోటుతో లక్షా 70వేల మందిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తూ జయ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఆర్డినెన్స్ జారీ చేయడం అప్పట్లో దేశంలోనే సంచలనం సృష్టించింది. అయితే ఆ ఆదేశాల తరువాత అక్కడ ఉద్యోగులు, ప్రతిపక్ష డీఎంకే సహాయంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూనే.. ప్రభుత్వ ఉద్యోగులకు సమ్మె చేసే నైతిక హక్కు లేదని, అయితే, మానవతా దృక్పథంతో ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పి వారంతా ఉద్యోగాల్లో చేరవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
ఉద్యోగులను వెనక్కి తీసుకోం..సగం బస్సులు ప్రైవేటుకు
ఆర్టీసీని మూడు రకాలుగా విభజిస్తాం : కేసీఆర్‌

''ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఆర్థిక, పారిశ్రామిక కార్యక్రమాలను స్తంభింపజేసే హక్కు రాజకీయ పార్టీలు లేదా సంస్థలకు లేదు'' అని జస్టిస్ ఎంబీ షా, జస్టిస్ ఏఆర్ లక్ష్మణన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. కార్మిక సంఘాలకు యాజమాన్యంతో బేరసారాలు సాగించే హక్కు ఉన్నప్పటికీ సమ్మె చేసే హక్కు లేదని జస్టిస్ ఎంబీ షా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో సమ్మెలో పాల్గొన్నవారిలో లిఖితపూర్వకంగా క్షమాపణలు చెబుతూ, మళ్లీ సమ్మెకు దిగమని ప్రమాణపత్రం దాఖలు చేసిన 1,56,106 మంది ఉద్యోగులను ప్రభుత్వం మళ్లీ విధుల్లోకి తీసుకుంది. కానీ అంతకు ముందు పిటిషన్‌పై స్పదించిన మద్రాస్ హైకోర్టు ఉద్యోగులను విధుల్లోనుంచి తీసివేయడం సరైన నిర్ణయం కాదని తీర్పునిచ్చింది. కార్మికులకు సమ్మెచేసే హక్కు ఉందని కోర్టు స్పష్టం చేసింది. అయితే సమ్మెకు ముందస్తు నోటీసు ఇవ్వకుండా సమ్మెకు దిగినవారిపై ప్రభుత్వం ఏరకమైన చర్యలపైనా తీసుకుకోవచ్చని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా తమిళనాడులో ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో జయలిత పార్టీ 37 స్థానాలకు పడిపోయి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇదిలావుండగా.. తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తే న్యాయస్థాలను ఆశ్రమిస్తామని టీఆఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులు ఇదివరకే ‍ప్రకటించారు.

సమ్మె చేయడం చట్టబద్దమేనా?
ఇండస్ట్రియల్‌ డిస్‌ప్యూట్‌ యాక్ట్‌ - 1947 సమ్మె గురించి నిర్వచించింది. ఇందులోని సెక్షన్ 2 (క్యూ) సమ్మెను వివరిస్తుంది. దీని ప్రకారం సమ్మె అంటే ఏదైనా పరిశ్రమలో పనిచేసే కార్మికులు సంఘటితంగా పనులు నిలిపివేయడం, కొనసాగించడం చేయవచ్చు. సెక్షన్ 22 (1) ప్రకారం సమ్మె అనేది చట్టం చెప్పిన విధానాన్ని అనుసరించాలి. లేకపోతే ఆ సమ్మెను చట్టవిరుద్ధంగా భావించవచ్చు. ఈ చట్టం సమ్మె హక్కులపై కొన్ని ఆంక్షలను విధించింది. కాంట్రాక్టును ఉల్లంఘిస్తూ ప్రజా సంబంధిత సేవా సంస్థల్లో పనిచేసే ఏ వ్యక్తి ముందస్తు నోటీసు లేకుండా సమ్మెకు దిగకూడదని పేర్కొంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా