ఆర్టీసీ సమ్మె.. మహిళా కండక్టర్‌ కంటతడి

13 Oct, 2019 16:46 IST|Sakshi

సాక్షి, ఖమ్మం : ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా మారుతోంది. కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఖమ్మం డిపో డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్మికులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. శ్రీనివాస్‌రెడ్డి మృతిపట్ల ఖమ్మం బసు డిపో ఎదుట నిరసన తెలియజేస్తున్న కార్మికులను పోలీసులు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ మహిళా కండక్టర్‌ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తోటి కార్మికుడి మృతిపట్ల బాధతో శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే తమపై పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం దారుణమని అన్నారు. 

‘మా బాధలను ప్రజలు గుర్తించాలి. 20 ఏళ్ల నుంచి సంస్థను నమ్ముకుని బతుకుతున్నాం. పీఆర్‌సీ కోసం 30 నెలల వేచి చూశాం. 40 వేల మందికి ఈ నెల జీతాలు కూడా ఇవ్వలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే మేము పోరాడుతున్నాం. రాత్రి 2 గంటల నుంచి మహిళ కండక్టర్లకు నిద్ర కూడా లేద’ని కంటతడి పెట్టారు. ఈ క్రమంలో తీవ్ర ఆందోళనకు లోనైన ఆమె ఒక్కసారిగా కుప్పకులిపోయారు. 

నర్సంపేటలో కార్మికుడి ఆత్మహత్య యత్నం
సాక్షి, వరంగల్‌ రూరల్‌ : తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె ఉధృతంగా మారింది. నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన రవి అనే కార్మికుడు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. ఇది గమనించిన తోటి కార్మికులు, పోలీసులు రవిని నిలువరించాడు. ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో.. రాష్ట్రంలోని పలు డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థతులు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు