మరో ఆర్టీసీ కండక్టర్‌ మృతి 

15 Nov, 2019 02:27 IST|Sakshi

జోగిపేట(అందోల్‌) : ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మతిస్థిమితం కోల్పోయి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కండక్టర్‌ నాగేశ్వర్‌(43) బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన నాగేశ్వర్‌ నారాయణఖేడ్‌ డిపోలో విధులు నిర్వర్తించేవాడు. ఆయన మృతితో జోగిపేటలో ఉద్రిక్తత నెలకొంది. మృతదేహాన్ని గురువారం ఉదయం 5 గంటలకు అంబులెన్స్‌లో జోగిపేటకు తీసుకువచ్చారు. కాగా, స్థానిక ఆర్టీసీ జేఏసీ నేతలు నాగేశ్వర్‌ మృతదేహాన్ని నారాయణఖేడ్‌ డిపోకు తరలించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. మృతదేహాన్ని నారాయణఖేడ్‌ బస్‌డిపోకు ఎందుకు తీసుకువెళ్లకూడదని నిలదీశారు.

అంబులెన్స్‌లోనే మృతదేహం..  
ఇదిలా ఉండగా నాగేశ్వర్‌ మృతదేహాన్ని ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అంబులెన్స్‌ నుంచి బయటకు తీయనీయకుండా ఆర్టీసీ కార్మిక సంఘ నాయకులు అడ్డుకున్నారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల నగదు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు మంజూరు చేయిస్తామని డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, తెలంగాణ జాగృతి కార్యదర్శి భిక్షపతి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ తరఫున కార్మిక సంఘ నాయకులకు, మృతుడి భార్య సంగీతకు హమీ ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు