ముగిసిన ఆర్టీసీ జేఏసీ భేటీ.. కీలక ప్రకటన

19 Nov, 2019 15:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సమ్మె కొనసాగించాలా? వద్దా? అని దానిపై ఆర్టీసీ జేఏసీ నేతల కీలక సమావేశం ముగిసింది. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. సమ్మె కొనసాగింపుపై కార్మికుల అభిప్రాయం తీసుకున్నామని, ఆర్టీసీ జేఏసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కార్మికుల హామీ ఇచ్చారని వివరించారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పు కాపీ ఇంకా తమకు అందలేదని, కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత న్యాయనిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రేపు హైకోర్టు తుది తీర్పు ప్రకటించిన తరువాత సమ్మెపై జేఏసీ నిర్ణయం తీసుకుంటుందని, కోర్టు తీర్పు తరవాత రెండు రోజుల్లో ఆర్టీసీ జేఏసీ నిర్ణయం వెలువరిస్తామని చెప్పారు. జేఏసీ తుది నిర్ణయం తీసుకునేవరకు సమ్మె యథాతథంగా కొనసాగుతుందన్నారు.

ఎల్బీనగర్‌ హిమగిరి ఫంక్షన్ హాల్‌లో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. కార్మికుల సమ్మె అంశంతోపాటు భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించిన అనంతరం కార్మిక సంఘాల నేతలు కీలక నిర్ణయం వెలువరించే అవకాశముంది. అంతకుముందు కార్మిక సంఘాల నేతలు విడివిడిగా సమావేశమై.. తెలంగాణవ్యాప్తంగా కార్మికుల అభిప్రాయాలను డిపోలవారీగా సేకరించారు. ఎల్బీనగర్‌లోని హిమాగిరి ఫంక్షన్ హాల్‌లో టీఎంయూ నేతలు, కేకే గార్డెన్‌లోని ఈయూ నేతలు, సీఐటీయూ కార్యాలయంలో ఎస్టీఎఫ్ నేతలు, టీజేఎంయూ కార్యాలయంలో ఆ సంఘం నేతలు సమావేశమై చర్చించారు. జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.

ఉద్యోగ భద్రతపై గ్యారెంటీ ఏది?
46 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం వాదన ఏమిటి, కార్మికుల తరఫున ఏ వాదన వినిపించారు, కోర్టులు ఏం చెప్పాయి అన్నది చర్చించారు. అయితే, సమ్మె విరమణ విషయంలో కార్మికుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేవని, ఇంకా సమ్మె కొనసాగిస్తే.. ఇబ్బందులు ఎదురవుతాయని, లేబర్ కోర్టులో ఈ అంశం తేలడానికి చాలా సమయం పడుతుందని కొంతమంది కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా.. మరికొంతమంది ఎన్ని రోజులైనా ప్రభుత్వం దిగొచ్చేవరకు సమ్మె కొనసాగించాల్సిందేనని పట్టుబట్టినట్టు సమాచారం. ఉన్నపళంగా సమ్మె విరమిస్తే ఉద్యోగ భద్రత ఏమిటని కార్మికులు నేతలను ప్రశ్నించినట్టు సమాచారం. సమ్మెను విరమిస్తే ప్రభుత్వం ఉద్యోగంలోకి తీసుకుంటుందో లేదా అన్న ఆందోళన కార్మికుల్లో వ్యక్తమవుతోంది. కనీసం లేబర్‌ కోర్టులో తేలేవరకైనా సమ్మె కొనసాగించాలని మెజారిటీ కార్మికులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టీసీ ఈయూ సమావేశంలో తీవ్ర భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు సమాచారం. బ్యాలెట్ పెట్టి కార్మికుల అభిప్రాయం తీసుకోవాలని, ప్రభుత్వం నుంచి ఉద్యోగ భద్రతపై స్పష్టమైన హామీ పొందిన తర్వాత సమ్మె విరమించాలని పలువురు కార్మికులు పట్టుబట్టినట్టు తెలుస్తోంది. లేబర్ కమీషన్‌కు హైకోర్టు ఇచ్చిన 15 రోజుల సమయం వరకు వేచిచూద్దామని, ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మెను కొనసాగించాలని కార్మికుల్లో కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

సమ్మెపై తర్జనభర్జన
ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాల నేతలు తీవ్ర తర్జనభర్జనలకు లోనవుతున్నారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించడం.. సమ్మె అంశాన్ని లేబర్‌ కోర్టుకు నివేదించడంతో ఇరకాటంలో పడిన కార్మిక సంఘాల నేతలు.. సమ్మె కొనసాగింపుపై పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 46రోజులుగా కొనసాగిస్తున్న ఆర్టీసీ సమ్మెను విరమించే అవకాశముందని సమాచారం. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు కీలక ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు సమావేశమై.. అనంతరం అఖిలపక్షం ఆధ్వర్యంలో సమ్మె కొనసాగింపుపై తుది ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. సమ్మె నేపథ్యంలో చోటుచేసుకున్న 24 మంది ఆర్టీసీ కార్మికుల మరణాలపైనా కార్మిక నేతల మధ్య చర్చ జరిగింది. కార్మికులు సమ్మె విరమించి.. బేషరతుగా విధుల్లోకి చేరేందుకు ముందుకొస్తే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కార్మికులు విధుల్లో చేరాలంటూ ప్రభుత్వం రెండు గడువు విధించింది. ఈ డెడ్‌లైన్లకు అప్పట్లో పెద్దగా స్పందన రాని విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు