ఆర్టీసీ సమ్మె విరమణ..!

20 Nov, 2019 15:06 IST|Sakshi

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎట్టకేలకు ఫుల్‌స్టాప్‌ పడింది. 47 రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగిన సమ్మెను విరమించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ బుధవారం సాయంత్రం ప్రకటించింది. బేషరతుగా కార్మికులను ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవాలని, ఈ విషయమై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే.. సమ్మె విరమించి మళ్లీ విధుల్లోకి చేరుతామని ఆర్టీసీ జేఏసీ వెల్లడించింది.  విధుల్లో చేరిన కార్మికులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, సమ్మెకు ముందున్న పరిస్థితులను సంస్థలో మళ్లీ కల్పించాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఎటువంటి ఆంక్షలు, నిబంధనలు లేకుంటేనే కార్మికులు మళ్లీ విధుల్లోకి చేరుతారని, కార్మికులు విధుల్లో చేరితే డ్యూటీ చార్జ్‌ల మీద మాత్రమే సంతకాలు పెడతారని ఆయన తెలిపారు.

సమ్మె కొనసాగింపుపై ఆర్టీసీ కార్మిక సంఘాలు నిన్నటినుంచి తీవ్ర తర్జనభర్జనలకు లోనైన సంగతి తెలిసిందే. సమ్మె అంశాన్ని హైకోర్టు లేబర్‌ కోర్టుకు నివేదించడంతో.. సమ్మె కొనసాగింపుపై కార్మిక సంఘాలు పునరాలోచనలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ బుధవారం కూడా సమావేశమైంది. సమ్మె విషయమై లేబర్‌ కమిషన్‌కు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ సమావేశంలో నేతలు క్షుణ్ణంగా పరిశీలించారు. మరోవైపు కొనసాగింపు కార్మికుల్లో తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. గత 47 రోజులుగా సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా సమ్మె కొనసాగించడం సమంజసం కాదని, ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు లేక కార్మికుల కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నాయని మెజారిటీ కార్మికులు అభిప్రాయపడటంతో సమ్మె విరమణకే జేఏసీ మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది. అయితే, ఉద్యోగ భద్రతపై కార్మికుల్లో ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. కార్మికులు సమ్మె విరమణకు ఓకే చెప్పడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు