ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం.. ఎండీకి లేఖ

27 Oct, 2019 17:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె విషయంలో ఇప్పటికీ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో శనివారం ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు, అధికారుల మధ్య జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. చర్చలు విఫలం కావడానికి కారణం మీరంటే మీరు అని ఇరు పక్షాలు ఆరోపించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలు ఆదివారం సంస్థ ఎండీకి లేఖాస్త్రాన్ని సంధించారు. మొత్తం 45 డిమాండ్లపై చర్చకు సిద్ధమంటూ లేఖలో నేతలు పేర్కొన్నారు. దీనిపై ఆర్టీసీ అధికారులు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహిస్తున్నారు.

రేపు కలెక్టరేట్ల ముట్టడి
ఆర్టీసీ సమ్మెలో భాగంగా తమ ఉద్యమాన్ని కార్మిక సంఘాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా సోమవారం కలెక్టరేట్ల ముట్టడికి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. జేఏసీ పిలుపునకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ.. కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చింది. కార్మికుల ఆందోళనను విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు.
 

మరిన్ని వార్తలు