ఆర్టీసీ సమ్మె : ‘నవంబర్‌ 5లోపు విధుల్లో చేరండి’

2 Nov, 2019 20:49 IST|Sakshi

ఆర్టీసీని విలీనం చేసేది లేదు : సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 49 అంశాలపై చర్చ జరిగిందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు మీడియాతో అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదని కేబినెట్‌ నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల చేశామని చెప్పారు. ఎక్సైజ్ పాలసీతో రూ.975 కోట్ల ఆదాయం కలిసి వచ్చిందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘చరిత్ర ఎవరూ చెరపలేరు. చావు దాకా వెళ్లి వచ్చిన. తెలంగాణ అంటే అమితమైన అభిమానం ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోసమే తీసుకుంటాం’అన్నారు.

2100 బస్సులు మూలకు..
5100 బస్సు రూట్లలో ప్రైవేటు వాహనాలకు అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని సీఎం తెలిపారు. అంతులేని కోరికతో ఆర్టీసి కార్మికులు సమ్మెకు వెళ్లారని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వ లో విలీనం చేయబోయేది లేదని కేసీఆర్‌ మరోసారి ఉద్ఘాటించారు. ఆర్టీసీలో మొత్తం 10,400 బస్సులు ఉన్నాయని, వాటిలో 8300 బస్సులు ఆర్టీసీ బస్సులు, 2100 అద్దె బస్సులు ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో 2300 మూలకు పడ్డాయని చెప్పారు.  చర్చల మధ్యలో సమ్మెకు వెళ్లొద్దని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

నవంబర్‌ 5 లోపు చేరండి.. ఇబ్బంది పెట్టం
‘ఆర్టీసీ కార్మికుల కార్యాచరణ అర్ధరహితమైనది. ప్లాట్ ఫామ్ స్పీచ్ వేరు రియాలిటీ వేరు. కార్మికులు రోడ్డున పడే అవకాశముంది. బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి రావొద్దు. చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీ లేదు. వెస్ట్ బెంగాల్లో బెస్ట్ పద్ధతి ఉంది. ఆర్టీసీ ఉండాలి ప్రైవేటు బస్సులు ఉండాలి. ఆరోగ్య కరమైన పోటీ ఉండాలని నిర్ణయించాం. కేంద్రం తెచ్చిన కొత్త చట్టం ప్రకారం నిర్ణయం తీసుకున్నాం. కార్మికుల ఎడల కఠినంగా లేము. 67 శాతం వేతనాలు పెంచాం. 4260 మందిని రెగులరైజ్ చేశాం. కార్మికుల కడుపు నింపినం. ఎవరి పొట్ట కొట్టలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరు గౌరవ ప్రదంగా గడపాలని కోరుకుంటుంది. చేనేత కార్మికుల ఆత్మహత్యలు నివారించాం. ఆర్టీసీ కార్మికులు మా బిడ్డలే. యూనియన్ల మాయ లో పడి రోడ్డున పడొద్దు. ఆర్టీసీ కార్మికులకు మరో అవకాశం ఇస్తున్నం. వారంతా నవంబర్ 5 లోపు విధుల్లో చేరవచ్చు. భవిష్యత్తు ఉంటది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టము’అన్నారు.

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
‘ప్రైవేటు బస్సుల నిర్వాహకులు ప్రభుత్వ నియంత్రణలో ఉంటారు. అన్ని పాసులు అమల్లో ఉంటాయి. ఆరోగ్యకరమైన పోటీ కోసమే ఆర్టీసీపై ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాం. కార్మికులు పునరాలోచన చేయాలి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యూనియన్ల బెదిరింపులు ఉండకూడదు. భవిష్యత్తుని కాపాడుకోవాలి. యాజమాన్యం అదుపు ఆజ్ఞాల్లో సిబ్బంది ఉంటే లాభాలు వస్తాయి. ఆర్టీసీకి నష్టదాయకంగా ఉన్న రూట్లు ఇవ్వాలని పలు ట్రాన్స్‌పోర్టు కంపెనీలు కోరుతున్నాయి. ఆర్టీసీ విలీనం అంతటితో ఆగదు 92 సంస్థలు అడుగుతాయి అలాంటి డిమాండ్లే చేస్తాయి. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత మార్పు ఉండదు.

కార్మికులు కుటుంబాల్ని రోడ్డున పడేయొద్దు. నవంబర్ 5 వరకు విధుల్లోకి రాకపోతే... మిగతా 5 వేల రూట్లు కూడా ప్రైవేటుకు అప్పగిస్తాం. మా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోం. అవకాశం ఇవ్వకపోతే ప్రభుత్వం తప్పు. అవకాశం చేజార్చుకోవద్దు. నలుగురు బీజేపీ ఎంపీలు అక్కడ బిల్లుకు ఆమోదం చెప్పి... ఇక్కడ వ్యతిరేకించడం ఏమిటి ? శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయం చేస్తున్నారు. మధ్య ప్రదేశ్‌లో ఆర్టీసీని రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వమే. బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. చట్టవిరుద్ధంగా సమ్మె చేస్తున్నారు.  కార్మికుల చావులకు యూనియన్లు, రాజకీయ పక్షాలే కారణం. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వలేదు పక్షపాతం వహించలేదు. ఆర్టీసీ విలీనం అంశాన్ని ఏపీలో ఎన్నికల హామీ గా ఇచ్చారు. ఇక్కడ అలా హామీ ఇవ్వలేదు’అని ముఖ్యమంత్రి చెప్పారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా