హైపవర్‌ కమిటీకి ఒప్పుకోం : తేల్చిచెప్పిన సర్కారు

13 Nov, 2019 17:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు విచారణ బుధవారం కొనసాగింది. సమ్మె పరిష్కారానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని, దీనిపై తమ అభిప్రాయం చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరగా.. ఈ కమిటీకి తాను ఒప్పుకునేది లేదని ప్రభుత్వం న్యాయస్థానానికి స్పష్టం చేసింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని తెలిపారు. ఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.

సమ్మె చట్టవిరుద్ధమని మీరెలా చెప్తారని ప్రశ్నించింది. సమ్మె పరిష్కారానికి హైపవర్‌ కమిటీ వేయాల్సిందేనంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది రాపోలు ఆనంద భాస్కర్‌ వాదనలు వినిపించారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు. ఇప్పటివరకు 27మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని పిటిషనర్లు న్యాయస్థానానికి నివేదించారు. హైపవర్‌ కమిటీని వేసి సమస్యను పరిష్కరించాలని రాపోలు ఆనంద భాస్కర్‌ కోర్టును అభ్యర్థించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణను రేపటికి వాయిదా వేసింది. కార్మికుల సమ్మెపై విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.
చదవండి: హైపవర్‌ కమిటీపై సర్కార్‌ నిర్ణయంతో మరో మలుపు!

మరిన్ని వార్తలు