ఆర్టీసీ సమ్మె : సూర్యాపేట డిపో దగ్గర ఉద్రిక్తత

14 Oct, 2019 11:00 IST|Sakshi

సాక్షి, నల్లగొండ : సూర్యాపేట ఆర్టీసీ డిపో దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట ధర్నాకు పూనుకున్నారు. తాత్కాలిక సిబ్బందిని గేటు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కార్మికులు డిపో ముందే బైఠాయించడంతో... బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ధర్నాలో కాంగ్రెస్‌, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కార్మికులు, నేతలను అరెస్టు చేసి.. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మహిళా కార్మికురాలు ఒకరు సొమ్మసిల్లి పడిపోయారు. పోలీస్‌స్టేషన్‌లో కార్మికులు, నేతల ధర్నా కొనసాగుతోంది.

ధర్నాలో పాల్గొన్న వీహెచ్‌
కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు. సూర్యాపేట పోలీస్‌స్టేషన్‌లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ధర్నాలో వీహెచ్‌ పాల్గొన్నారు.

పదో రోజుకు చేరిన సమ్మె
సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి పదో రోజుకు చేరింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆర్టీసీ కార్మికులు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తూ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ఎదుట బహిరంగ సభలు నిర్వహించారు. 15న రాస్తారోకోలు, 16న విద్యార్థుల ర్యాలీలు, 17న ధూందాం కార్యక్రమాలు, 18న బైక్‌ ర్యాలీలు చేపట్టాలని ఐకాస నిర్ణయించింది.

మరిన్ని వార్తలు