ఆర్టీసీ సమ్మె విరమణ పేరిట మోసం..!

21 Nov, 2019 16:20 IST|Sakshi

జేఏసీ సమ్మె విరమించినా జేఏసీ-1 కొనసాగిస్తుంది

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె విరమణ విషయంలో కార్మిక సంఘాల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్టు కనిపిస్తోంది. షరతులు లేకుండా విధుల్లోకి తీసుకుంటే.. సమ్మె విరమించేందుకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ బుధవారం సాయంత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, జేఏసీ ప్రకటనపై టీజేఎంయూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమించినా.. జేఏసీ-1 సమ్మె విరమించేది లేదని టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్‌ తెలిపారు. సమ్మెలో ఇప్పటివరకు 29మంది ఆర్టీసీ కార్మికులు మరణించారని ఆయన తెలిపారు. మరణించిన కుటుంబాలను ఎవరూ ఆదుకోలేదని తెలిపారు. దీనికితోడు సమ్మెలో భాగంగా రాష్ట్రంలోని పలు  డిపోల పరిధిలో కార్మికులపై కేసులు కూడా నమోదయ్యాయని, వాటిపై ఏం మాట్లాడకుండా సమ్మె విరమిస్తున్నామని జేఏసీ చెప్పడం.. కార్మికులను మోసం చేయడమేనని హనుమంతు మండిపడ్డారు.

ఇలా విరమించాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడే  సమ్మె విరమిస్తే సరిపోయేదని, కార్మికులను బలి పశువులను చేస్తూ జేఏసీ సమ్మె విరమణ ప్రకటన చేసిందని ఆయన అన్నారు. ఆర్టీసీ జేఏసీ కేవలం  మూడు కార్మిక సంఘాలను కలుపుకొని మాత్రమే ముందుకు వెళ్తోందన్నారు. జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అసమర్థత వల్లే ఆర్టీసీలో సమస్యలు పేరుకుపోయాయని పేర్కన్నారు. ఆర్టీసీ కార్మికులు చాలావరకు పేద వాళ్ళు అని, ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేయకుండా కాపాడాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  సీఎం కేసీఆర్ తమను పిలిచి కార్మికుల సమస్యల గురించి తెలుసుకోవాలని కోరుతున్నామని అన్నారు.

మరిన్ని వార్తలు