ఆర్టీసీ సమ్మె: ‘విలీన అంశాన్ని వాయిదా వేస్తున్నాం’

14 Nov, 2019 19:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసే అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. మిగిలిన అంశాలపై తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికులను ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయిస్తుందని మండిపడ్డారు. సేవ్‌ ఆర్టీసీ పేరుతో రేపటి నుంచి డిపోల ముందు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు.

కార్మికులు ఆత్మస్తైర్యాన్ని కోల్పోయి, ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని సంఘాలు, ప్రజల మద్దతు ఉందన్నారు. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత అని స్పష్టం చేశారు.  ఈ నెల 15న గ్రామ గ్రామానికి బైక్‌ ర్యాలీ నిర్వహించి, 16న తనతో పాటు జేఏసీ కో కన్వీనర్‌ రాజిరెడ్డి, లింగమూర్తి, సుధ నిరవధిక దీక్ష చేపట్టబోతున్నామని చెప్పారు. 17,18తేదిలలో ప్రతి డిపో ముందు 50మంది చొప్పున కార్మికులు నిరహారదీక్షకు చేపడుతారన్నారు. 19న సడక్‌ బంద్‌ పేరుతో హైదరాబాద్‌ నుంచి కోదాడ వరకు ర్యాలీ నిర్వహించబోతున్నామని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు