సమ్మె విరమించండి

15 Oct, 2019 00:58 IST|Sakshi

ఆర్టీసీ కార్మికులకు టీఆర్‌ఎస్‌ ఎంపీ కేకే వినతి

సాక్షి, హైదరాబాద్‌: పరిస్థితులు చేయి దాటక ముందే ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెను విరమించి ప్రభుత్వంతో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.కేశవరావు పిలుపునిచ్చారు. సమ్మెలో ఉన్న ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం తనను ఎంతో బాధించిందని, ఏ సమస్యకూ ఆత్మాహుతి లేదా ఆత్మహత్య పరిష్కారం కాదన్నారు. ఈ మేరకు కేకే సోమవారం లేఖ విడుదల చేశారు. ‘టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపట్ల ఎప్పుడూ సానుకూల ధోరణితోనే వ్యవహరిస్తూ వచ్చింది.

గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల్లో ఇచ్చిన 44 శాతం ఫిట్‌మెంట్, 16 శాతం మధ్యంతర భృతి ప్రభుత్వ సానుకూల ధోరణికి నిదర్శనం. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్‌ మినహా సంస్థ ఉద్యోగులు లేవనెత్తిన ఇతర అంశాలను పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా’ అని కేకే లేఖలో పేర్కొన్నారు. ‘ఆర్టీసీని ప్రైవేటీకరించరాదనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. అలాంటి నిర్ణయాలు ఎంత మాత్రం శ్రేయస్కరం కాదనే విషయాన్ని అందరూ గమనించాలి.

ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళనతోపాటు దేశంలో బస్సు రవాణాలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ప్రజారవాణాలో మూడంచెల ఏర్పాట్లు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేవలం ఓ ప్రయోగంలా మాత్రమే చూడాల్సి ఉంది. 50 శాతం బస్సులను ఆర్టీసీ, 30 శాతం బస్సులను స్టేజి క్యారియర్లుగా, మరో 20 శాతం బస్సులను ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా నడపాలనేది ఓ ప్రయోగంలా మాత్రమే భావించాలి’ అని కేశవరావు వ్యాఖ్యానించారు.

‘ప్రభుత్వ నియంత్రణలో నడిచే రాష్ట్ర, ప్రభుత్వరంగ సంస్థల నడుమ ఎంతో తేడా ఉంటుంది. ప్రభుత్వం అనేది ఎంత మాత్రం వాణిజ్య సంస్థ కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం రూపొందించే విధానాలను ఏ వ్యవస్థ కూడా నిర్దేశించలేదు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన అంశం పార్టీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడిగా ఎన్నడూ నా పరిశీలనలోకి రాలేదు. కాబట్టి ఆర్టీసీ లేదా ఏ ఇతర ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే అంశంపై ఎలాంటి స్థితిలోనూ పునరాలోచన ఉండబోదని కేశవరావు స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా