అక్కడ రద్దు.. ఇక్కడ స్పెషల్‌

29 Sep, 2019 03:22 IST|Sakshi

దసరాకు సరిపడా బస్సుల్లేక ఆర్టీసీకి తప్పని తిప్పలు 

ఈసారి 4,900 ప్రత్యేక బస్సులు

సాక్షి, హైదరాబాద్‌: దసరా వేళ ఆర్టీసీకి కొత్తచిక్కొచ్చి పడింది. అటు ప్రయాణికులకు సరిపడా బస్సులు నడపలేక, ఇటు ఉన్న బస్సుల్ని సర్దలేక సతమతమవుతోంది. దసరా రద్దీ కోసం దాదాపు 4,900 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ప్రకటించింది. అందుకోసం రెగ్యులర్‌ సర్వీసుల్ని తగ్గించి, లేదా పూర్తిగా రద్దు చేసి దసరా స్పెషల్‌గా తిప్పేందుకు సిద్ధమైంది. వాస్తవానికి రాష్ట్రంలో సుమారు 850 గ్రామాలకు బస్సు వసతి లేదు.  ఈ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాంటే ఆర్టీసీ ఇప్పటికిప్పుడు కనీసం 3 వేల బస్సులు సమకూర్చుకోవాలని అధికారులు చెబుతున్నారు.  

అదనపు చార్జీ వసూలు నిబంధన 
పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో  స్పెషల్‌ సర్వీసులకు 50% మేర అదనపు చార్జీ వసూలుకు అధికారికంగా వెసులుబాటు ఉంది. అసలే తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఈ అవకాశాన్ని చేజార్చుకునే పరిస్థితి లేదు. దీంతో డిమాండ్‌ తక్కువగా ఉన్న ప్రాంతాల సర్వీసులను కుదించి, కొన్నింటిని పూర్తిగా రద్దు చేసి స్పెషల్‌ బస్సులుగా తిప్పేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. మరికొన్ని చోట్ల ట్రిప్పు వెళ్లి వచ్చిన తర్వాత, తదుపరి ట్రిప్పునకు సమయం ఉండి, కొన్ని బస్సులు ఖాళీగా ఉంటాయి. ఇలాంటి వాటిని కూడా దసరా స్పెషల్‌గా వేసేశారు. 

నగరం నుంచే దాదాపు 20 లక్షల మంది 
తెలంగాణలో దసరా రద్దీ అధికంగా ఉంది. బతుకమ్మతో కలసి వచ్చే పర్వదినాలు కావటంతో సొంతూళ్లకు వెళ్లేవారి సంఖ్య భారీగా ఉంటుంది. వారిలో మూడొంతుల మంది బస్సులపైనే ఆధారపడతారు. ఒక్క హైదరాబాద్‌ నుంచే దాదాపు 20 లక్షల మంది పయనమవుతారు. ఇంతమందికి రెగ్యులర్‌ సర్వీసులు చాలనందున కచ్చితంగా స్పెషల్‌ సర్వీసులు తిప్పాల్సి ఉంటుంది. అయితే కొన్నేళ్లుగా ఆర్టీసీ కొత్త బస్సులు కొనకపోతుండటంతో అంతపెద్ద సంఖ్యలో స్పేర్‌ బస్సులు లేకుండా పోయాయి. గతంలో ఉన్న అదనపు బస్సుల్ని ఆర్టీసీ రెగ్యులర్‌ సర్వీసులుగా చేసేసింది. దీంతో  వేరే ప్రాంతాల సర్వీసులను రద్దు చేసి లేదా కుదిం చి స్పెషల్‌ బస్సులుగా తిప్పాల్సిన దుస్థితి ఇప్పుడు ఆర్టీసీకి నెలకొంది. గతేడాది కంటే  500 సర్వీసులు పెంచారు. ఒక్క హైదరాబాద్‌ నుంచే దాదాపు 1,200 సిటీ సర్వీసులు స్పెషల్‌ బస్సులుగా వాడుకుంటున్నారు. ప్రైవేటు బస్సులు ఇప్పటికే టికెట్‌ ధరలు రెట్టింపు చేసి అమ్ముతుండటంతో ఎక్కువమంది ఆర్టీసీ బస్సులవైపే చూస్తున్నారు. దీంతో ఈ అదనపు సర్వీసులు ఏర్పాటు తప్పనిసరి కావటం, బస్సులు చాలినన్ని లేకపోవటంతో అధికారులకు కత్తిమీద సాములాగా తయారైంది.  

మరిన్ని వార్తలు