లాంచీలో విహరిద్దాం..అందాలు తిలకిద్దాం

6 Sep, 2018 07:59 IST|Sakshi

నాగార్జునసాగర్‌–శ్రీశైలం టూర్‌  

ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన టీఎస్‌టీడీసీ  

సాక్షి, సిటీబ్యూరో : లాంచీలో 120 కిలోమీటర్లు... 5గంటల ప్రయాణం.. ఎన్నో అద్భుత ప్రాంతాల వీక్షణం.. ఊహించుకుంటేనే అద్భుతమైన అనుభూతిలా అనిపిస్తుంది కదూ! ఈ అనుభూతి మీరూ పొందాలంటే చలో సాగర్‌. తెలంగాణ పర్యాటకాభివృద్ధిసంస్థ(టీఎస్‌టీడీసీ) నాగార్జునసాగర్‌–శ్రీశైలం బోటింగ్‌ టూర్‌కు శ్రీకారం చుట్టింది. రోడ్‌ కమ్‌ రివర్‌ టూర్‌ పేరుతోఈ నెల 8 నుంచి నిర్వహించనుంది.

నాలుగేళ్లుగా ఆశించిన మేర నీరు లేకపోవడంతో ఈ ప్రయాణానికి బ్రేకులు పడ్డాయి. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కువరడంతో సాగర్‌లో బోటింగ్‌కు సరిపడా నీరు చేరింది. దీంతో టీఎస్‌టీడీసీ టూర్‌ ఏర్పాటు చేసింది. నాగార్జుసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. సాగర్‌–శ్రీశైలం బోటింగ్‌ ప్రయాణం ప్రారంభించాలంటే కనీసం 570 అడుగుల నీటిమట్టం ఉండాలి. ప్రస్తుతం ఈ మేరకు ఉండడంతో పర్యాటకులకు బోటింగ్‌ అవకాశం లభించింది.  

టూర్‌ ఇలా...  
ఈ టూర్‌ బుధ, శనివారాల్లో మాత్రమే ఉంటుంది. ఇది రెండు రోజుల ప్యాకేజీ. ఈ నెల 8న ఉదయం 6:30 సికింద్రాబాద్‌ యాత్రినివాస్‌ నుంచి టూర్‌ ప్రారంభమవుతుంది. బస్‌ 7గంటలకు బషీర్‌బాగ్‌ సీఆర్‌వోకు చేరుకుంటుంది. అక్కడి నుంచి 10:30గంటలకు నాగార్జునసాగర్‌ చేరుకుంటుంది. ఉదయం 10:30గంటలకు లాంచీ ప్రయాణం మొదలవుతుంది. సాయంత్రం 4:30గంటలకు లాంచీ శ్రీశైలం చేరుకుంటుంది. శ్రీశైలంలో రోడ్డు మార్గంలో సాక్షి గణపతి చూపిస్తారు. రాత్రి ప్రైవేట్‌ హోటల్‌లో బస ఉంటుంది. రెండోరోజు ఉదయం 9:30గంటల నుంచి స్థానిక ప్రదేశాలను చూపిస్తారు. మధ్యాహ్నం 1:30గంటలకు శ్రీశైలం నుంచి ప్రయాణం ప్రా రంభమవుతుంది. సాయంత్రం 6గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు.  

ధర ఎంత?  
పెద్దలకు రూ.3 వేలు (నాన్‌ ఏసీ), చిన్నారులకు(5–12 ఇయర్స్‌) రూ.2,400 చెల్లించాలి. ట్రాన్స్‌పోర్టు, లాంచీ ప్రయాణం, శ్రీశైలంలో బస టీఎస్‌టీడీసీ చూసుకుంటుంది. లాంచీలో భోజన వసతి ఏర్పాటు చేస్తారు. రెండో రోజు మాత్రం బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌ వ్యక్తిగతమే. వివరాలకు 040–23262151, 52, 53, 54, 57 నెంబర్లలో సంప్రదించొచ్చు. సెల్‌ నెంబర్లు: 98485 40371, 98483 06435, 98481 26947. టోల్‌ఫ్రీ నెంబర్‌:180042546464.  

చాయిస్‌ మీదే...  
నగరవాసుల సౌకర్యార్థం ఈ టూర్‌ ఏర్పాటు చేశాం. వినోదంతో పాటు ఆధ్యాత్మికత జత చేశాం. టూర్‌ ఎంపికలో ప్రయాణికులు చాయిస్‌ ఉంది. ఎవరైనా సొంత వాహనాల్లో వచ్చి కేవలం బోటింగ్‌ చేయొచ్చు. బోటింగ్‌కు రానుపోను పెద్దలకు రూ.2,200, పిల్లలకు రూ.1,800. అదే కేవలం వన్‌వే అయితే పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.800.       – బి.మనోహర్, టీఎస్‌టీడీసీ ఎండీ  

మరిన్ని వార్తలు