ప్రభుత్వాన్ని కీలక వివరణ కోరిన హైకోర్టు

28 Oct, 2019 18:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణలో భాగంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్టీసీ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలపై హైకోర్టు నిలదీసింది. జీహెచ్‌ఎంసీ నుంచి రావాల్సిన రూ. 1475 కోట్లు, ప్రభుత్వ సబ్సిడీ కింద రావాల్సిన రూ. 1492 కోట్లతోపాటు ప్రభుత్వం నుంచి రూ. 2,300 కోట్ల చెల్లింపులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే రేపటిలోగా (మంగళవారం) వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించగా.. ఎలుండి వరకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది. అందుకు హైకోర్టు అం‍గీకరించలేదు. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఆర్టీసీకి నిధుల బకాయిలపై రేపటిలోగా పూర్తి వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది.

బకాయిలు చెల్లించకపోవడం వల్లే నష్టాలు!
ఇక ఆర్టీసీ కార్మిక సంఘాల తరఫున వాదనలు వినిపించిన ప్రకాశ్‌ రెడ్డి.. కార్మికులు లేవనెత్తిన ప్రతి అంశంమీద చర్చలు జరపాల్సిందేనని హైకోర్టుకు నివేదించారు. కార్మికుల 26 డిమాండ్లను కచ్చితంగా చర్చించాలన్నారు. కార్మికులు లేవనెత్తిన అంశాలు మొత్తం న్యాయపరమైనవేనని, వీటివల్ల ఆర్ధికభారం పడుతుందని ప్రభుత్వం వాయిదావేస్తూ వస్తుందని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తే.. ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు రాకనే ఆర్టీసీ నష్టాల్లో ఉందని వివరించారు. ఆర్టీసీ కార్పొరేషన్‌కు ఇప్పటివరకు పూర్తిస్థాయి ఎండీని ప్రభుత్వం నియమించలేదని, ఎండీ ఉండి ఉంటే, కార్మికులు తమ సమస్యలను ఆయనకు చెప్పుకునేవారని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన అంశాలను హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

హైకోర్టుకు తప్పుడు లెక్కలు!
ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు సమర్పిస్తోందని నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎంఎన్‌యూ) జాతీయ అధ్యక్షుడు మౌలాలా ఆరోపించారు. ఆర్టీసీకి బకాయిలపై రేపటిలోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిందని అన్నారు. సమ్మె చట్టబద్ధమేనని హైకోర్టు చెప్పిందని, కార్మికులు అధైర్యపడవద్దని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.
చదవండి: ఆర్టీసీ సమ్మెపై విచారణ: హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ సమ్మె: హైకోర్టు ఆగ్రహం.. ఏజీ రావాల్సిందే!

మరిన్ని వార్తలు