పొత్తులపై టీటీడీపీ సీనియర్ నేతల్లో విభేదాలు

19 Sep, 2018 14:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : ఎన్టీఆర్ భవన్‌లో బుధవారం తెలంగాణ తెలుగుదేశం నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి టీటీడీపీ చీఫ్ ఎల్ రమణతో పాటు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. త్వరలో ప్రతిపక్షాలతో కలిసి ఏర్పాటు చేయనున్న మహా కూటమితో పాటు చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నోటీసులు ఇవ్వడంపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణ జనసమితి అధినేత కోదండరాంతో కలసి వెళ్లే విషయాన్ని కూడా పలువురు నేతలు ఈ భేటీలో ప్రస్తావించారు. పొత్తులు, సీట్లపై త్వరగా క్లారిటీ తీసుకుంటే ఉమ్మడి ఎన్నికల ప్రణాళికపై ముందుకు వెలదామని రమణపై టీటీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు.

మరోవైపు మంగళవారం జరిగిన సమావేశంలో జగిత్యాల, వనపర్తి, నర్సంపేట టికెట్లు ఎట్టిపరిస్థితుల్లో టీడీపీకి ఇవ్వటం కుదరదని టీపీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో పలువురు టీడీపీ సీనియర్‌ నేతలు గుర్రుగా ఉన్నారు. గెలిచే సీట్లు వదులుకోవద్దు అని కాంగ్రెస్‌ అధ్యక్షులు రాహుల్ గాంధీ తమతో చెప్పారని, పైగా సిట్టింగ్ స్థానాలు టీడీపీకి ఎలా ఇస్తామని, ఇప్పటికే ఉప్పల్ టీడీపీకీ ఒప్పుకోవటంతో తమ నేత లక్ష్మారెడ్డి టీఆర్ఎస్‌లో చేరారని ఉత్తమ్‌ చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో టికెట్ల కేటాయింపుపై చంద్రబాబునాయుడుతోనే డైరెక్ట్‌గా తేల్చుకుంటామని పలువురు టీడీపీ నేతలు అమరావతి బాటపడుతున్నారు. 

ఎల్‌ రమణను జగిత్యాల నుంచి కోరుట్ల, రావుల చంద్రశేఖర్ రెడ్డిని వనపర్తి నుంచి దేవరకద్ర, రేవూరి ప్రకాశ్‌రెడ్డిని నర్సంపేట్ నుంచి పరకాల వెళ్లాలని కాంగ్రెస్‌పార్టీ సూచించినట్టు సమాచారం. కోరుట్ల వెళ్లేందుకు రమణ సిద్ధంగా ఉన్నా నియోజకవర్గం మారేందుకు రావుల, రేవూరిలు ససేమీరా అంటున్నారు. దేవరకద్ర టికెట్‌ తనకే కావాలని టీడీపీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీటీటీడీ అత్యవసర సమావేశంలో సీనియర్‌ నేతలు రమణ వద్ద అసహనం వ్యక్తం చేసి అమరావతిలోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీతో సీపీఐ, టీజేఎస్‌, టీడీపీ కలిసి మహా కూటమిగా ఏర్పడాలని కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు