అంతా అయోమయం 

24 May, 2018 01:31 IST|Sakshi

  దిక్కుతోచని స్థితిలో టీటీడీపీ 

  నేడు తెలంగాణ టీడీపీ మహానాడు 

సాక్షి, హైదరాబాద్‌: అధినేతకు పట్టింపు లేదు. క్షేత్రస్థాయిలో ఉన్న కొద్దిపాటి కేడర్‌ను కూడా నడిపించేందుకు నాయకుడు లేడు. వెరసి తెలంగాణలో అగమ్యగోచరంగా పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ టీడీపీ మహానాడుకు సన్నద్ధమవుతోంది. గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరిగే ఈ మహానాడుకు పార్టీ అధినేత చంద్రబాబు కూడా హాజరవుతున్నారు. 

ఓటుకు కోట్లు తర్వాత 
తెలంగాణ ఆవిర్భావ సమయంలోనే టీడీపీకి ఎడాపెడా దెబ్బలు తగిలాయి. కేడర్‌తో పాటు నేతలు కూడా పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల్లో చేరిపోయారు. అలా సగానికి పైగా పార్టీ ఖాళీ అయిపోయింది. 2014లో 15 అసెంబ్లీ స్థానాలు, 1 లోక్‌సభ స్థానంలో గెలిచినా ఓటుకు కోట్లు ఉదంతం టీడీపీని కోలుకోలేని దెబ్బతీసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ఎమ్మెల్యేల ఓట్ల కొనుగోలుకు దిగడం, నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు పెద్ద మొత్తంలో డబ్బులిస్తూ అప్పటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి రెడ్‌హాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడటం, ‘మనవాళ్లు బ్రీఫ్డ్‌ మీ. మరేం పర్లేదు, నేనున్నానం’టూ స్టీఫెన్‌సన్‌ను చంద్రబాబే నేరుగా ఫోన్‌లో ప్రలోభపెట్టడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఓటుకు కోట్లు దెబ్బతో రాష్ట్రంలో టీడీపీ కేడర్‌ కూడా తాము టీడీపీ అని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడడం ప్రారంభించారు. ప్రస్తుతం తెలంగాణలో తాము టీడీపీ అని చెప్పుకునే నేతలు వేళ్లపై లెక్కపెట్టే సంఖ్యలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో జరగనున్న మహానాడులో ఏం తీర్మానాలు చేస్తారు, ఎలాంటి పంథా ఎంచుకుంటారు, బాబు ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.  

మరిన్ని వార్తలు