విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి: టీటీజేఏసీ

14 Jun, 2019 01:46 IST|Sakshi
శ్రీపాల్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ టీచర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీటీజేఏసీ) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. గురువారం హైదరాబాద్‌లోని పీఆర్‌టీయూ భవన్‌లో టీటీజేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఏకీకృత సర్వీసు నిబంధనలను వెంటనే రూపొందించి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మండల విద్యాధికారి, ఉప విద్యాధికారి, డైట్‌ లెక్చరర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తీర్మానించారు. టీచర్‌ పోస్టుల్లో కొత్తగా నియమితులైన వారిని వెంటనే నియమించి, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపడుతూ, రేషనలైజేషన్‌ చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. జూన్‌ నెలాఖరు నాటికి విద్యార్థుల సంఖ్యను పరిగణనలో తీసుకొని రేషనలైజేషన్‌ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి , మాజీ ఎమ్మెల్సీ రవీందర్, టీటీజేఏసీ సెక్రటరీ జనరల్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెళ్లి కమలాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈ సమస్యలన్నింటిపై ఉత్తర్వులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని, విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి  జి. జగదీష్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు.
 
టీటీజేఏసీ చైర్మన్‌గా పింగళి శ్రీపాల్‌రెడ్డి 
టీటీజేఏసీ చైర్మన్‌గా పింగళి శ్రీపాల్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన ఆయన ఇటీవలే పీఆర్‌టీయూ–టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

>
మరిన్ని వార్తలు