గొట్టపు మాత్ర వెజ్జా? నాన్‌వెజ్జా?

10 Jun, 2017 08:31 IST|Sakshi
గొట్టపు మాత్ర వెజ్జా? నాన్‌వెజ్జా?

సుస్తీ చేసినపుడు డాక్టరు రకరకాల మాత్రలు ఇస్తుంటారు. ఇందులో గొట్టపు మాత్రలు కూడా ఉంటాయి. మనం ఎన్నోసార్లు వేసుకున్నాం కూడా. అయితే మనం వేసుకొనే గొట్టపు మాత్రలు వెజ్జా? నాన్‌వెజ్జా? ఇదెక్కడి ప్రశ్న అనుకుంటున్నారా... మీరు చదివింది కరెక్టే. పారదర్శకంగా ఉండే క్యాప్యూల్స్‌ (గొట్టాల్లో) లోపల మందు మిశ్రమం నింపుతారు. అల్లోపతితో పాటు ఆయుర్వేదంలోనూ ఈ గొట్టాల వాడకం విరివిగా ఉంది. ఈ క్యాప్యూల్స్‌ను ‘గెలాటిన్‌’తో తయారు చేస్తారు.

గెలాటిన్‌ ఎలా తయారు చేస్తారంటే...
గెలాటిన్‌లో కొలాజెన్‌ ఉంటుంది. ఇది ఎముకల్లో, మృదులాస్థిలో ఉంటుంది. భారీ జంతువుల ఎముకలను, కీళ్లను, ఇతర భాగాలను ఉడికించడం ద్వారా గెలాటిన్‌ తయారుచేస్తారు. అందుకే ఇది నాన్‌వెజ్‌. రోగకారక వైరస్‌లు గెలాటిన్‌లో ఉండే అవకాశాలుంటాయని, విరేచనాలు, కడుపుబ్బరం లాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయని డాక్టర్లు హెచ్చరిస్తు న్నారు. పైగా మతపరమైన విశ్వాసాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ గెలాటిన్‌ క్యాప్సూల్స్‌కు బదులుగా... పూర్తి వెజ్‌ క్యాప్సూల్స్‌ను వాడకంలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

చెట్ల నుంచి తీసిన ‘సెల్యులోజ్‌ (గుజ్జు)’ద్వారా క్యాప్సూల్స్‌ను వాడేలా నిబంధనలను మార్చే సమగ్ర విధాన రూపకల్పన నిమిత్తం ఔషధ పరిశ్రమ, ఇతర నిపుణుల అభిప్రాయాలను తీసుకోవడానికి కేంద్ర ఆరోగ్యశాఖ ఒక కమిటీని కూడా వేసింది. గెలాటిన్‌ను సౌందర్య సాధనాల్లో అధికంగా వాడతారు. గెలాటిన్‌ చవక అయినప్పటికీ ఆరోగ్యపరంగా, మతపరమైన విశ్వాసాల దృష్ట్యా ఇక కొనసాగించకూడదని కేంద్రం భావిస్తోంది. – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

మరిన్ని వార్తలు