సర్కారు బడుల్లో ట్యూషన్‌

28 Aug, 2019 02:53 IST|Sakshi
ఇబ్రహీంపూర్‌ గ్రామ పాఠశాల

రాష్ట్రంలోనే మొదటిసారిగా సిద్దిపేట జిల్లా ఇబ్రహీంపూర్‌లో..  

నేడు హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభం 

సిద్దిపేట రూరల్‌: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు దత్తత గ్రామం ఇబ్రహీంపూర్‌ మళ్లీ ఒక వినూత్న కార్యక్రమానికి వేదిక కానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రైవేటు తరహాలో సాయంత్రం వేళ అదనంగా ట్యూషన్‌ ప్రక్రియను నిర్వహించే పద్ధతిని గ్రామంలో ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోనే సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపూర్‌ గ్రామంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు అదనపు తరగతుల బోధనలను బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను విద్యాశాఖ వేగవంతం చేసింది.

సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారాన్ని అందించే ప్రక్రియను చేపట్టిన ఎమ్మెల్యే హరీశ్‌రావు సాయంత్రం వేళల్లో విద్యార్థులకు చదువుపై ఆసక్తి కలిగేలా అదనపు తరగతుల బోధనకు శ్రీకారంచుట్టారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో ట్యూషన్‌ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో మొదట ఆయన దత్తత గ్రామం ఇబ్రహీంపూర్‌ను ఎంచుకున్నారు. గ్రామానికి చెందిన నిరుద్యోగ బీఈడీ యువత, రిటైర్డ్‌ టీచర్లతో ప్రతీ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో సాయంత్రం అదనపు తరగతులకు బోధించనున్నారు.  

>
మరిన్ని వార్తలు