అవిశ్వాసం నోటీసు తుస్!

27 Mar, 2015 01:21 IST|Sakshi
  • ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చేందుకు టీడీపీ యత్నం
  • అసెంబ్లీకి వెళ్లేందుకు యత్నించిన నేతలను అడ్డుకున్న పోలీసులు
  • సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంపై శాసనసభలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలని టీ టీడీపీ పన్నిన ఆఖరి వ్యూహాన్ని కూడా సర్కారు విజయవంతంగా అడ్డుకుంది. సస్పెండైన టీడీపీ సభ్యులు అసలు శాసనసభ ఆవరణలోకే రాకుండా పకడ్బం దీగా వ్యవహరించింది. సభ ప్రారంభం కావడానికి గంట ముందే అవిశ్వాస తీర్మానం నోటీసును శాసనసభా వ్యవహారాల కార్యదర్శి రాజా సదారామ్‌కు అందజేసి.. మరోసారి వార్తల్లోకి ఎక్కాలని టీ టీడీపీ భావించినప్పటికీ సాధ్యం కాలేదు.

    ‘సస్పెన్షన్‌కు గురైన సభ్యులు అసెంబ్లీలోకి రాకూడదు’ అని స్పీకర్ ఆదేశాల పేరుతో అసెంబ్లీ వెలుపలే ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. అసెంబ్లీ ఆవరణలోకి వచ్చిన ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, రాజేందర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావులను మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో వారు టీడీఎల్పీ కార్యాలయం ఆవరణ ముందు ధర్నా చేపట్టగా.. పోలీసులు వారిని అరెస్టు చేసి ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌కు తరలించారు. ఇదే సమయంలో కారులో అసెంబ్లీకి వస్తున్న రేవంత్‌రెడ్డిని మూడో గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు.

    దాంతో ఆయన కారును గేటుకు అడ్డంగానే నిలిపి, అందులోనే కూర్చున్నారు. దీంతో అసెంబ్లీలోకి వెళ్లాల్సిన వాహనాలన్నీ రోడ్డుపైనే నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే వాహనా న్ని తెప్పించి, కారును వెస్ట్‌జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించి, రేవంత్‌ను పార్టీ కార్యాలయానికి పంపించారు. తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలు వివేక్, గాంధీలను, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి తదితరులనూ అరెస్టు చేసి ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌కు తరలించారు.

    ఇక చివరికి టీడీఎల్పీ కార్యాలయ సిబ్బందితో అవిశ్వాస తీర్మానం నోటీసును అసెంబ్లీ కార్యదర్శికి పంపగా... అప్పటికే సమయం ముగియడంతో ఆయన తిరస్కరించారు. కాగా, దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతిపక్షం అంటేనే రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల గౌరవానికి సాక్షాత్తుస్పీకరే భంగం కలిగించడం ప్రజాస్వామ్యంలో ఎక్కడా జరగలేదని ఆరోపించారు. ప్రభుత్వం, స్పీకర్ వైఖరిని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి తీవ్రంగా ఖండించారు.

మరిన్ని వార్తలు