అ జిల్లాలో అన్ని స్థానాలు మావే! : ఎంపీ పొంగులేటి

15 Sep, 2018 12:20 IST|Sakshi
పాలేరు వద్ద భారీ ర్యాలీతో స్వాగతం పలుకుతున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు (ఇన్‌సెట్‌) ఓపెన్‌జీపులో ప్రదర్శనగా వస్తున్న తమ్మల నాగేశ్వరరావు

కూసుమంచి (ఖమ్మం): పాలేరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషిచేశానని, గతంలో మాదిరిగానే ఇంకా ఎంతో చేస్తానని, రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని టీఆర్‌ఎస్‌ పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థిత్వం ప్రకటన తర్వాత శుక్రవారం ఆయన తొలిసారిగా జిల్లాకు రాగా పార్టీ శ్రేణులు సరిహద్దు నాయకన్‌గూడెం వద్ద ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా కూసుమంచిలో నిర్వహించిన బహిరంగ సభలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు.

తనపై నమ్మకం ఉంచి, అభివృద్ధి చేస్తానని విశ్వసించి గత ఎన్నికల్లో పాలేరు స్థానం నుంచి  ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. తాను ఇక్కడి ఎమ్మెల్యేగా  రెండు సంవత్సరాల మూడు నెలల్లో  ఊహించని విధంగా అభివృద్ధి చేసి చూపానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ప్రాంత ప్రజల కన్నీళ్లను తుడిచారని, ఆయన ఆశీస్సులతోనే పాలేరు జలాలతో ఇక్కడి ప్రజల కాళ్లు కడిగానని అన్నారు. ప్రజలు కోరినా, కోరకపోయినా అనేక పనులు చేసిచూపానన్నారు. రాష్ట్రంలో అందరికీ ప్రభుత్వం సంక్షేమ ఫలాలను అందించిందని 100 సీట్లతో తిరిగి అధికారంలోకి రాబోతున్నామని అన్నారు.
 
అ అన్ని స్థానాలూ మావే..: ఎంపీ పొంగులేటి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాబోయే  ఎన్నికల్లో అన్ని సీట్లను టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుచుకుంటుందని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు అనగానే ప్రతిపక్ష పార్టీల నాయకులు బట్టలు సర్దుకుని నియోజకవర్గాలకు బయలుదేరారని ఎద్దేవా చేశారు. కానీ టీఆర్‌ఎస్‌ నాయకులు నిత్యం ప్రజలతో ఉంటూ కష్టసుఖాలను పట్టించుకున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన దమ్ము, సత్తా సీఎం కేసీఆర్‌కే ఉందని అన్నారు. పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు తెలుసునని, మళ్లీ ఆయనకే పట్టం కడతారని అన్నారు.

పాలేరు సీటు ఏకగ్రీవం చేయాలి..: కొండబాల 
పాలేరును తుమ్మల నాగేశ్వరరావు అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని ఈ స్థానాన్ని ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను నిలపకుండా ఏకగ్రీవం చేయాలని విపక్షాలకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఎంతోకాలంగా వెనుకబడిన పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు సిరులు పండించేలా చేశారని,  ఇక్కడ అభివృద్ధిని అడ్డుకోవద్దని కోరారు. ప్రజల బాగుకోరే వారు  ఈ సీటును ఏకగ్రీవం చేయాలని అన్నారు.

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు, ఐడీసీ చైర్మన్‌ ఎంబీ.బేగ్‌ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సత్తుపల్లి, మధిర అభ్యర్థులు పిడమర్తి రవి, లింగాల కమల్‌రాజ్, జెడ్పీ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, మేయర్‌ పాపాలాల్,  రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీపీలు రామసహాయం వెంకటరెడ్డి, కొప్పుల అశోక్, నందిగాం కవితారాణి, జెడ్పీటీసీ సభ్యులు వడ్తి రాంచంద్రునాయక్,  భారతి, ఏఎంసీ చైర్మన్‌ శాఖమూరి రమేష్, టీఆర్‌ఎస్‌ నాయకులు తాతా మధు, సాధు రమేష్‌రెడ్డి, రామసహాయం నరేష్‌రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీనాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు