టీడీపీ ఓటమికి వారిద్దరే కారణం

20 May, 2014 02:18 IST|Sakshi
టీడీపీ ఓటమికి వారిద్దరే కారణం

ఖమ్మం రూరల్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ ఘోర పరాజయానికి ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, పాలేరు అసెంబ్లీ అభ్యర్థి స్వర్ణ కుమారి కారణమని ఆ పార్టీ పాలేరు నియోజకవర్గ నాయకులు వీరవెల్లి నాగేశ్వరరావు, మద్ది మల్లారెడ్డి, ఆలుదాసు ఆంజనేయులు ఆరోపించారు. తుమ్మల వర్గీయులుగా చలామణవుతున్న వారు ముగ్గురు కలిసి ఖమ్మం బైపాస్ రోడ్డులోగల పీవీఆర్ గార్డెన్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఖమ్మం పార్లమెంట్,పాలేరు అసెంబ్లీలో టీడీపీ ఓటమికి తుమ్మల వర్గీయులే కారణమని స్వర్ణకుమారి చెప్పడం సరికాదని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ పార్టీ అభివృద్ధి కోసం తామంతా తుమ్మల నాయకత్వంలో పనిచేస్తున్నామని అన్నారు. ‘‘పార్టీలో నామా నాగేశ్వరరావు చేరిన తరువాతనే వర్గాలు మొదలయ్యాయి. వర్గ రాజకీయాలను నామా ప్రోత్సహించాడు’’ అని ధ్వజమెత్తారు. పాలేరు నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని మండల అధ్యక్షులుగా ఎంపిక చేయడం, పార్టీలోని ఎస్సీ.. ఎస్టీ కార్యకర్తలపై దాడులకు దిగడంతో నష్టం జరిగిందని అన్నారు. అనేకమంది కార్యకర్తలు టీడీపీకి దూరమయ్యారని అన్నారు.

 కాంగ్రెస్ నాయకులకు ‘నామా’ డబ్బులిచ్చారు..
 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు నామా నాగేశ్వరరావు డబ్బులు ఇచ్చారని, తన వెంట తిరిగిన టీడీపీ కార్యకర్తలకు కనీసం ఖర్చులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ‘‘ఆయన ఎంపీగా ఉన్న కాలంలో తన కోటా కింద వచ్చిన నిధులను కేవలం తన అనుచరులకే ఇచ్చుకున్నారు. పార్టీకార్యకర్తలను విస్మరించారు’’ అని ధ్వజమెత్తారు. పార్టీ ఆదేశానుసారమే తాము పనిచేశామని, తమపై స్వర్ణకుమారి లేనిపోని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.

 బీసీలకు ఒక్క స్థానం కూడా ఇవ్వకపోవడంతో వారు టీడీపీకి దూరమయ్యారని అన్నారు. ‘‘ఎంపీటీసీ ఎన్నికల్లో ఖమ్మం రూరల్ మండలంలో తుమ్మల వర్గానికి గెలిచే చోట ఒక్క బీ-ఫారం కూడా ఇవ్వలేదు. దీనికి కారణం నామానే కారణం’’ అన్నారు. ‘‘పార్టీ ఓటమికి కారణమైన నామా నాగేశ్వరరావు, స్వర్ణకుమారి, వారి అనుచరులను అధిష్టానం సస్పెండ్ చేయాలి. లేదంటే.. మా దారి మేము చూసుకుంటాం’’ అని తెగేసి చెప్పారు. సమావేశంలో టీడీపీ నాయకులు రానేరు యాదగిరి, ఆలస్యం నాగేశ్వరరావు, జడల నగేష్‌గౌడ్, చంద్రారెడ్డి, బాణోత్ పంతులు, సర్పంచులు భారి వీరభద్రం, బాణోత్ శ్రీనివాస్, యల్లయ్య వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు