తుమ్మలకు పట్టం

17 Dec, 2014 07:30 IST|Sakshi
తుమ్మలకు పట్టం

' తెలంగాణ ప్రభుత్వ కేబినెట్‌లో తొలిసారి జిల్లాకు స్థానం
' ఆర్‌అండ్‌బీ, స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రిగా నాగేశ్వరరావు
' తుమ్మల భుజస్కంధాలపై పార్టీ బలోపేతం, జిల్లా అభివృద్ధి

 
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎట్టకేలకు రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాకు స్థానం లభించింది. టీఆర్‌ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్ కేబినెట్‌లో చోటు దక్కింది. కేబినెట్ విస్తరణలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో తుమ్మల నాగేశ్వరరావు చేత గవర్నర్ ఈఎల్ నర్సింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రహదారులు, భవనాలశాఖ, స్త్రీ, శిశు సంక్షేమశాఖలను ఆయనకు కేటాయించారు. దాదాపు దశాబ్దకాలంపాటు మంత్రి పదవికి దూరంగా ఉన్న తుమ్మలకు టీఆర్‌ఎస్‌లో చేరడంతో మరోమారు అమాత్యయోగం దక్కింది. జిల్లాలో సీనియర్ నాయకునిగా పేరున్న నాగేశ్వరరావుకు గత అనుభవం దృష్ట్యా సీఎం కేసీఆర్ రోడ్లు, భవనాలశాఖను కేటాయించారు. బోనస్‌గా స్త్ర్రీ, శిశు సంక్షేమశాఖను కూడా అప్పగించారు.
 
 గతంలోనూ ఆర్‌అండ్‌బీ శాఖ..
 రోడ్లు, భవనాల శాఖమంత్రిగా తుమ్మల నాగేశ్వరరావుకు విశేష అనుభవం ఉంది. అందుకే ఆయన అభిరుచి మేరకు కేసీఆర్ కీలకమైన ఆ శాఖ బాధ్యతలను అప్పగించారంటున్నారు. 2004లో రాష్ట్రంలో టీడీపీ అధికారం కోల్పోయే నాటికి తుమ్మల రహదారులు, భవనాల శాఖమంత్రిగానే ఉన్నారు. సరిగ్గా పదేళ్ల తర్వాత మళ్లీ అదే శాఖ బాధ్యతలు స్వీకరించారు. కేసీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న తుమ్మలకు ఆయన కోరుకున్న శాఖనే సీఎం అప్పగించారని జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. అభివృద్ధిపరంగా, రాజకీయపరంగా జిల్లాలో టీఆర్‌ఎస్ మార్క్ పాలన తుమ్మల నేతృత్వంలో సాగనుంది. జిల్లాకు చెందిన తుమ్మలకు మంత్రిపదవి,  కొత్తగూడెం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు సహాయ మంత్రి హోదా కలిగిన పార్లమెంటరీ సెక్రటరీ పదవి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా పిడమర్తి రవిని నియమించడం జిల్లాకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమని టీఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా అభివృద్ధి, పార్టీ బలోపేతం కోసం తుమ్మల ఈ మేరకు సక్సెస్ కాగలుగుతారో అనే దానిపైనే ఇప్పుడు చర్చ సాగుతోంది.
 
 పలు పర్యాయాలు మంత్రిగా...
 తుమ్మల ఇప్పటికే పలు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. 1985, 1994, 1999 సార్వత్రిక ఎన్నికల్లో సత్తుపల్లి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలుపొందారు. అటు ఎన్టీఆర్, ఇటు చంద్రబాబు మంత్రివర్గంలో వివిధ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ఖమ్మంలో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 2014లోనూ టీడీపీ నుంచి ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం టీడీపీలో నెలకొన్న వర్గపోరు, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే మంత్రి పదవి చేపట్టారు. మంగళవారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఇటు శాసనసభ, అటు శాసనమండలిలో సభ్యుడు కాకుండా ప్రమాణస్వీకారం చేసిన ఘనత సైతం తుమ్మలకే దక్కింది. రాష్ట్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తుమ్మలకు గవర్నర్ కోటాలో కానీ, ఎమ్మెల్యేల కోటాలో కానీ ఎమ్మెల్సీగా ఎంపిక చేయడానికి ఇప్పటికే రంగం సిద్ధమైంది.
 
 బృహత్తర బాధ్యతలెన్నో...
 తుమ్మలపై నమ్మకంతో కేసీఆర్ కీలకమైన శాఖలకు మంత్రిగా నియమించారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం, రానున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను విజయపథంలో నడిపించే బాధ్యతను కేసీఆర్ తుమ్మలకే అప్పగించినట్లు తెలుస్తోంది. ఇకపోతే టీడీపీ నుంచి తనతోపాటు టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన బాలసాని లక్ష్మీనారాయణ ఎమ్మెల్సీ పదవీకాలం సైతం మరో నాలుగు నెలల్లో ముగియనుంది. జిల్లా నుంచి ఖాళీ అయ్యే మూడు ఎమ్మెల్సీ పదవులను టీఆర్‌ఎస్ ఖాతాలో వేసుకోవడంలోనూ తుమ్మల రాజకీయ వ్యూహాలను అనుసరించాల్సి ఉంది.  తుమ్మల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దృష్ట్యా టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున హైదరాబాద్ తరలివెళ్లారు. జిల్లాకు మంత్రి పదవి కూడా రావడంతో ఆ పార్టీ నేతల దృష్టి జిల్లాస్థాయి నామినేటెడ్ పదవులపై పడింది. మంత్రి తుమ్మలను ప్రసన్నం చేసుకోవడం ద్వారా నామినేటెడ్ పదవులను పొందేందుకు ద్వితీయశ్రేణి నేతలు ఇప్పటినుంచే వ్యూహ రచన చేస్తున్నారు.

మరిన్ని వార్తలు