పసుపు బోర్డే పరిష్కారం

17 Oct, 2019 12:22 IST|Sakshi
టర్మరిక్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల సభ్యులు, రైతులు

పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే 

టర్మరిక్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ తొలి భేటీలో ప్రతినిధుల డిమాండ్‌

సాక్షి, నిజామాబాద్‌ : కనీస మద్దతు ధర ప్రకటించి పసుపు రైతులను తక్షణం ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన టర్మరిక్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశంలో ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. పసుపు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ కమిటీ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు నివేదిక ఇవ్వాలని తీర్మానించింది. నిజామాబాద్‌ నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో బుధవారం కమిటీ తొలి సమావేశం జరిగింది. 

ప్రస్తుతం పసుపు పంట స్పైసిస్‌బోర్డు పరిధిలో ఉండటంతో కనీస మద్దతు ధర ప్రకటించే పరిస్థితి లేనందున, స్పైసిస్‌ బోర్డు పరిధిలో నుంచి తొలగించి, ప్రత్యేకంగా పసుపుబోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకునేలా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. పసుపులో నాణ్యమైన దిగుబడులు వచ్చే వంగడాలపై పరిశోధనలు జరగాలని కోరారు.  

కాంగ్రెస్‌ చారిత్రక తప్పిదం చేసింది : ఎంపీ అర్వింద్‌ 
ప్రత్యేక పసుపు బోర్డు ఏర్పాటుతోనే రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారమని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పేర్కొన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో ఔషధ గుణాలున్న పసుపును స్పైసిస్‌ (సుంగధ ద్రవ్యాల) బోర్డు పరిధిలోకి తెస్తూ అప్పటి కాంగ్రెస్‌ సర్కారు చారిత్రక తప్పిదం చేసిందని విమర్శించారు. 1987లో స్పైసెస్‌ బోర్డు ఏర్పాటు చేసినప్పుడు ఈ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. పసుపును వంటకాల్లో వాడుకునేది రుచి కోసం కాదని, బ్యాక్టిరియాలను నిర్మూలించడం కోసమనే అంశాన్ని అప్పట్లో కాంగ్రెస్‌ గుర్తెరగ లేకపోయిందన్నారు.

1981లో కొబ్బరికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసిన కాంగ్రెస్, అప్పట్లో పసుపును మాత్రం సుగంధ ద్రవ్యాల బోర్డులో కలిపేస్తూ చేతులు దులుపుకుందని అన్నారు. కేరళ కాంగ్రెస్‌ నాయకులు కొబ్బరి బోర్డును సాధించుకుంటే., అప్పటి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ నాయకులు పసుపుబోర్డును సాధించుకోవడంలో విఫలమయ్యారని అన్నారు. కొబ్బరికి ప్రత్యేక బోర్డు, కనీస మద్దతు ధర ఉన్నప్పటికీ ఏటా కొబ్బరి ఎగుమతుల విలువ రూ.రెండు వేల కోట్లకు మించడం లేదని, బోర్డు, కనీస మద్దతు ధర లేని పసుపు ఎగుమతులు రూ.1,200 కోట్లుకు మించి ఉంటాయని వివరించారు.

క్యాన్సర్, అల్టీమర్స్, టీబీ, వాపులు, మెదడుకు సంబంధించిన అనేక జబ్బులను నయం చేసే గుణాలున్న పసుపునకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సరైన విత్తన సరఫరా లేకపోవడం, రైతులకు అవగాహన కల్పించకపోవడంలో గత ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేశాయన్నారు. యాంత్రీకరణ, డిమాండ్‌కు తగ్గట్టు పంట సాగు, కర్కుమిన్‌ పెంచడం, కోల్‌ స్టోరేజీల సౌకర్యం కల్పించడం వంటి సౌకర్యాల కల్పన దిశగా అడుగులు పడ్డాయని అన్నారు.

సమావేశంలో స్పైసిస్‌బోర్డు డైరెక్టర్‌ ఏబీ రెమాశ్రీ, బోర్డు మెంబర్‌ సెక్రటరీ లింగప్ప, డీఏఎస్‌డీ డైరెక్టర్‌ హామి చేరియన్, మహారాష్ట్రకు చెందిన రీసెర్చ్‌ డైరెక్టర్‌ హల్దాన్‌కర్, జయశంకర్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మనోహర్‌రావు, కర్నాటకకు చెందిన టర్మరిక్‌ గ్రొవర్స్‌ సొసైటీ ప్రతినిధి హెచ్‌ రవికుమార్, మెఘాలయాకు చెందిన స్పైసిస్‌ ప్రొడ్యూసర్‌ కోఆపరేటివ్‌ సొసైటీ ప్రతినిధి ట్రినిటీ సైలో, మహారాష్ట్రకు చెందిన ఎగుమతి దారులు భరత్‌ మస్కాయ్, ఈరోడ్‌కు చెందిన వ్యాపారి సత్యమూర్తి, కమిటీ సభ్యులు గోపాలకృష్ణన్, డి ప్రసాద్, హార్టికల్చర్‌ అధికారి ఎస్‌ నర్సింగ్‌ దాస్, ఎం వెంకటేశ్వర్లు, బెనర్జీ, కంచన్, రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు