పసుపు రైతుకు ప్రతి ఏటా నష్టాలే!

5 May, 2014 00:30 IST|Sakshi

ధారూరు, న్యూస్‌లైన్:  ఒకప్పుడు తులం బంగారానికి వచ్చిన ధర క్వింటాలు పసుపునకు వచ్చిందని, మళ్లీ ఆ మద్దతు ధర రాకపోతుందా.. అనే ఆశతో ప్రతీ సంవత్సరం పసుపు పంటను సాగు చేస్తున్నా నష్టాలే తప్పలాభాలు రావటం లేదని పసుపు రైతులు ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధర లభిస్తుందన్న ఆశతో మండలంలోని పలు గ్రామాల రైతులు యేటా పసుపును సాగు చేస్తూనే ఉన్నారు. కేవలం 2010లో క్వింటాలు పసుపునకు రూ.18 వేల నుంచి రూ.19,500  వరకు మద్దతు ధర పలికింది. అప్పటి నుంచి రైతులు పెద్ద మొత్తంలో పసుపును పండిస్తున్నా 2011 నుంచి  ఇప్పటివరకు ధర త గ్గడమే తప్ప పెరిగిన దాఖలాలు లే వని రైతులు వాపోతున్నారు.

 మండలంలోని కేరెల్లి, కొండాపూర్‌ఖుర్దు, ధర్మాపూర్, కొండాపూర్‌కలాన్, అవుసుపల్లి, ధారూరు, చింతకుంట, హరిదాస్‌పల్లి, అల్లిపూర ఎబ్బనూర్, బాచారం తదితర గ్రామాల్లో రైతులు దాదాపు 1200 ఎకరాల విస్తీర్ణంలో పసుపుపంట పండిస్తున్నారు. పెట్టిన పెట్టుబడులు రాక నష్టాలనే చవిచూస్తున్నారు. పసుపు పంట సాగు చేసిన రైతన్నలు ఎకరాకు రూ.60 వేల పెట్టుబడి పెడుతున్నా అమ్మకానికి మార్కెట్‌కు వెళితే మాత్రం క్వింటాలుకు రూ. 5,200 నుంచి రూ.6 వేల వరకే మద్దతు ధర పలకడంతో పెట్టుబడులు పోను చేతికి చిల్లిగవ్వ కూడా రాకపోగా నష్టాలే వస్తున్నాయని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 సంవత్సరాలుగా బహిరంగ మార్కెట్లో మద్దతు ధర రాకున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం తమ దీన స్థితిని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

 పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు
 పొలాల పక్కనే పారుతున్న నది, వాగుల నుంచి డీజిల్ మోటార్ల ద్వారా నీటిని వాడటంవల్ల వేలల్లో ఖర్చవుతుందని రైతులు వాపోవున్నారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడమే ప్రధాన కారణమని రైతులు పేర్కొన్నారు. ఒక తడికి ఎకరాకు డీజిల్ ఖర్చు రూ.5 నుంచి రూ.6 వేల వరకు అవుతుందన్నారు. కనీసం 4, 5 తడుల నీరు పెట్టాలని, ఇందుకు రూ.20 వేలకు పైగా ఖర్చవుతుందని చెప్పారు.

 20 రోజుల పాటు కష్టాలే..
 పంట చివరి దశలో 20 రోజుల పాటు శ్రమించాల్సి ఉంటుందని రైతులు పేర్కొన్నారు. పొలాన్ని దున్ని పసుపును వెలికి తీయడంతో పాటు ఉడికించడం, కొమ్ము, గొండలు వేరు చేయడం వంటి పనులు ఉంటాయన్నారు. పెద్ద మొత్తంలో కూలీలు అవసరవువుతారని, వారికి దినసరికూలి రూ.200  చొప్పున ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

 ఇంత ఖర్చు చేసినా పసుపుకొమ్ములను ఆరబెడితే ప్రస్తుతం అకాల వర్షాలు పసుపుకొమ్ముల రంగు మారడానికి కారణవువుతుందని వాపోతున్నారు. దీంతో ధర మరింత తగ్గి  నష్టాలనే చవి చూస్తున్నామన్నారు. పసుపు రైతుల బాధలు గమనించి క్వింటాలుకు కనీసం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు మద్దతు ధర లభించేలా చూడాలని వారు అధికారులను కోరుతున్నారు.

మరిన్ని వార్తలు