మారిన వారికి ఉపాధి

8 Mar, 2016 02:48 IST|Sakshi

గుడుంబా విక్రయించిన వారి వివరాల సేకరణ
అదే జీవనాధారంగా బతుకుతున్న వారికి ఆర్థిక సాయం
త్వరలో పలు వృత్తుల్లో ఉపాధి చూపించడానికి
సిద్ధమవుతున్న అధికారులు
 
 
మహబూబ్‌నగర్ క్రైం : గుడుంబాను సమూలంగా నిర్మూలించేందుకు సర్కార్ నడుం బిగించింది. ఇప్పటికే ప్రభావిత గ్రామాల్లో కనిపించకుండా పోయిన గుడుంబా ఆనవాళ్లు భవిష్యత్‌లోనూ పూర్తిగా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే జీవనాధారంగా బతుకుతున్న కుటుంబాలు తిరిగి అటువైపు వెళ్లకుండా ప్రణాళిక రూపొందించింది. అవసరమైతే అలాంటి కుటుంబాలకు ఉపాధి కలిగేలా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మూడు రోజుల్లో అబ్కారీ శాఖ అధికారులు ప్రభావిత గ్రామాల్లో ప్రత్యేక సర్వే చేపట్టనున్నారు. జిల్లాలోని 585 ప్రభావిత గ్రామాల్లో పర్యటించి కుటుంబ పోషణ భారమైన వారి వివరాలను సేకరించనున్నారు.


గుడుంబా తయారీ, విక్రయాలు జరిపేందుకు అన్ని వనరులున్న 585గ్రామాలను అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఆయా గ్రామాల్లో జీవనాధారంగానే చాలా మంది తయారీ, విక్రయాలు జరుపుతున్నారని, కొంతమంది మాత్రమే గుడుంబా దందాచేసి డబ్బులు సంపాదిస్తున్నారని, అలాంటి వారి వివరాలు పూర్తిగా తమ వద్ద ఉన్నాయని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. అడవుల్లో ఉండే తండాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే గ్రామా ల్లో ఎక్కువగా గుడుంబా తయారీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. గతేడాది జూలై నుంచి ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు 1757మంది గుడుంబా విక్రయదారులపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఇందులో 12మందిపై పీడీ యాక్టు కేసులు కూడా నమోదు చేశారు.


 పలు వృత్తులో ఉపాధి..
 రాష్ట్ర ప్రభుత్వం సారా తయారు మానేసిన కుటుంబాలకు పలు వృత్తులో కార్పొరేషన్స్ ద్వారా రుణాలు ఇప్పించి, వారికి ఆసక్తి ఉన్న వృత్తులో ఉపాధి చూపిస్తారు. దీంట్లో డెయిరీఫాం, కోళ్లఫాం, కిరాణ దుకాణం, టైలరింగ్, గేదెల పెంపకం ఇలా పలు వృత్తులను గుర్తిస్తున్నారు.
 
  ఆర్థిక సాయం ..
 
గతంలో గుడుంబా తయారీ, విక్రయాలు జరిపి, తాజాగా పూర్తిగా మారిపోయి ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారికి ఆర్థిక సాయం చేసి, తద్వారా వారికి ఉపాధి కల్పించేందుకు సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అధికారులు సారా తయారీ మానేసిన కుటుంబాలను ఇప్పటికే 740 గుర్తించారు.  జిల్లాలో ఏ కేటగిరిలో 33, బీ కేటగిరిలో 152, సీ కేటగిరిలో 400గ్రామాలో ్లవిపరీతంగా సారా తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది జూలై నుంచి 1757 కేసులు, 1079 మంది అరెస్టు, 19628 లీటర్ల సారా సీజ్, 73 వాహనాలు సీజ్, 88వేల బెల్లం సీజ్ చేశారు. 12 పీడీయాక్టు కేసులు నమోదు చేశారు. అదేవిధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి 384 అవగాహన కార్యక్రమాలు, 484ర్యాలీలు నిర్వహించారు. బైండోవర్లు, అందులో జరిమానా విధించిన కేసులలో ప్రభుత్వానికి రూ.17లక్షల 78వేల ఆదాయం వచ్చింది.

మరిన్ని వార్తలు