చిట్టీల పేరుతో టీవీ నటి దగా

14 Mar, 2014 09:55 IST|Sakshi
చిట్టీల పేరుతో టీవీ నటి దగా

400 మంది తోటి నటులకు రూ.10 కోట్ల మేర టోపీ!
 హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన బాధితులు


 సాక్షి, హైదరాబాద్: బుల్లితెర నటులను నమ్మించి చిట్టీల పేరుతో రూ.10 కోట్ల మేర నిండా ముంచిన ఓ నటి వ్యవహారం వెలుగు చూసింది. 46 మంది బాధితులు గురువారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మను కలసి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. బత్తుల విజయరాణి(46) అనే టీవీ సీరియల్ ఆర్టిస్టు రూ. 5.35 కోట్ల రూపాయల మేర తమకు చెల్లించాల్సి ఉందని, న్యాయం చేయాలని వారు కోరారు. అయితే, బాధితుల సంఖ్య 400 మంది వరకు ఉంటుందని.. వీరందరికీ విజయరాణి చెల్లించాల్సిన మొతాన్ని లెక్కిస్తే రూ. 10కోట్ల మేర ఉంటుందని కొందరు మీడియాకు తెలిపారు.
 
 
  బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన బత్తుల విజయరాణి (46) టీవీ సీరియల్స్‌లో నటిస్తూ అమీర్‌పేట న్యూ శాస్త్రినగర్‌లో నివాసముంటోంది. 12 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం కూడా నడుపుతోంది. రూ. 5లక్షల నుంచి రూ. 50 లక్షల విలువైన చిట్టీల్లో సుమారు 400 మంది నటులు సభ్యులుగా చేరారు. గత నాలుగైదు నెలలుగా చిట్టీలు పాడిన వారికి ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో వారు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. రేపు మాపు అంటూ విజయరాణి వాయిదా వేస్తూ వస్తోంది. ఇది తెలిసి ఆమెకు లక్షల రూపాయల్లో బదులు ఇచ్చిన మరికొందరు కూడా తమ డబ్బులు తిరిగిచ్చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో విజయరాణి ఉన్నట్లుండి బుధవారం నుంచీ కనిపించకుండా పోయింది. దీనిపై బాధితులు జూనియర్ ఆర్టిస్టుల సంఘాన్ని ఆశ్రయించగా.. వారు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో వారు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీసీపీ జి.పాలరాజును ఆశ్రయించారు. ఆ తర్వాత నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు