మిడతలు మిక్సీ.. కోడికి మస్తీ! 

31 May, 2020 02:44 IST|Sakshi

పాక్‌లోని ఒకారా జిల్లాలో వినూత్న ప్రయోగం

మిడతలు పట్టిస్తే డబ్బిస్తామని అధికారుల ఆఫర్‌

వాటిని కోళ్ల ఫీడ్‌ ప్లాంట్లకు తిరిగి విక్రయించిన పరిశోధక బృందం

అధిక ప్రొటీన్లతో కోళ్లకు లభిస్తున్న బలవర్ధక ఆహారం  

సాక్షి, హైదరాబాద్‌: కరోనాకుతోడు ఇప్పుడు దేశాన్ని భయపెడుతున్న ప్రమాదం పంటలపై మిడతల దాడి. ఈ దండు దాడి చేసిందంటే సెకన్లు, నిమిషాలు, గంటల్లోనే పంటలన్నీ ఖాళీ అయిపోతాయి. దీంతో ఏ క్షణాన మిడతలు పంటలపై దాడి చేస్తాయోనన్న భయం రాష్ట్రాలను వెంటాడుతోంది. ఇదే పరిస్థితి మనకన్నా ముందు పాకిస్తాన్‌కూ ఎదురైంది. అక్కడి ప్రభుత్వం ఈ దండయాత్రను అడ్డుకొనేందుకు రసాయనాలపై ఆధారపడగా ఓ పరిశోధన బృందం మాత్రం సమస్య పరిష్కారానికి వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది.

నిశీధిలో ఓ వెలుగు.. 
పాకిస్తాన్‌లోని సింధ్, బలూచిస్తాన్, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలు ఈ మిడతలను చంపేందుకు వాడిన రసాయనాల కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌ జాతీయ ఆహార భద్రత పరిశోధన మంత్రిత్వశాఖలో సివిల్‌ సర్వెంట్‌గా పనిచేసే మహ్మద్‌ ఖుర్షీద్, తన స్నేహితుడు, పాక్‌ వ్యవసాయ పరిశోధన మండలిలో బయోటెక్నాలజిస్టుగా పనిచేసే జోహార్‌ అలీతో కలసి వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. మిడతలపై రసాయనాలు చల్లి చంపే బదులు వాటిని సజీవంగా పట్టుకొని బ్రాయిలర్‌ కోళ్లకు ఆహారంగా మారిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఓ ప్రయోగం చేయాలనుకున్నారు. ఇందుకోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకారా జిల్లాలోని అటవీప్రాంత సమీపంలో ఉన్న దీపల్‌పూర్‌లో (రసాయనాలు పిచికారీ చేయని ప్రాంతం కావడంతో దీన్ని ఎంచుకున్నారు) మూడు రోజులపాటు పైలట్‌ ప్రాజెక్టు చేపట్టారు. 

సోయాబీన్‌ కంటే చౌక 
పాకిస్తాన్‌లో పౌల్ట్రీ పరిశ్రమ కోళ్లకు అహారంగా సోయాబీన్‌ను ఉపయోగిస్తోంది. దాదాపు 3 లక్షల టన్నుల సోయాబీన్‌ను దిగుమతి చేసుకుని నూనె తీసిన అనంతరం వచ్చే పీచును అక్కడి కోళ్ల పరిశ్రమలో వినియోగిస్తున్నారు. ‘సోయాబీన్‌లో 45 శాతం ప్రోటీన్లు ఉంటే క్రిమిసంహారక మందుల ప్రభావంలేని మిడతల్లో అది 70 శాతం ఉంటుంది. కోళ్లకు పెట్టే సోయాబీన్‌ ఆహారం కిలో 90 రూపాయలుంటే మిడతలు ఉచితంగా వస్తున్నాయి. వాటిని పట్టుకునేందుకు ఖర్చు పెడితే చాలు. సోయాబీన్‌ కంటే బలవర్ధకమైన ఆహారం మా కోళ్లకు పెట్టొచ్చు’అని పాకిస్తాన్‌లో అతిపెద్ద పౌల్ట్రీ కంపెనీ అయిన హైటెక్‌ గ్రూప్‌ జీఎం మహ్మద్‌ అథర్‌ వెల్లడించారు. కోళ్లకే కాదు చేపలు, డెయిరీ పరిశ్రమకు కూడా ఇది ఆహారంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
మిడతల్ని బస్తాలలో మూటలు గట్టిన దృశ్యం

కిలో మిడతలకు 20 పాక్‌ రూపాయలు.. 
‘మిడతలను పట్టుకోండి.. డబ్బు సంపాదించండి.. పంటలు కాపాడుకోండి’అనే నినాదంతో ఖుర్షీద్‌ బృందం స్థానికులను ఆకర్షించింది. కిలో మిడతలను పట్టిస్తే 20 పాక్‌ రూపాయలు ఇస్తామని ఆఫర్‌ ఇచ్చింది. ఇంకేముంది.. రాత్రివేళ చెట్లపై సేదతీరే మిడతలను వలలతో పట్టుకొనేందుకు జనం పోటీపడ్డారు. ఒక్క రాత్రిలో ప్రజలంతా కలిపి సగటున ఏడు టన్నుల మిడతలను పట్టేసుకొని భారీగా సొమ్ము చేసుకున్నారు. ఒక్కో వ్యక్తి 20 వేల పాకిస్తానీ రూపాయలు సంపాదించారు. అంటే ఒక్కో వ్యక్తి వెయ్యి కిలోల మిడతలు పట్టుకున్నాడన్న మాట. స్థానికులు పట్టి తెచ్చిన మిడతలను ఖుర్షీద్‌ బృందం స్థానికంగా ఉండే కోళ్ల ఫీడ్‌ తయారు చేసే ప్లాంట్లకు విక్రయించింది.

మరిన్ని వార్తలు