ట్వింకిల్‌.. ట్వింకిల్‌ సూపర్‌స్టార్‌

20 Dec, 2019 07:41 IST|Sakshi
ఎఫ్‌ఎల్‌ఓ కార్యక్రమంలో జ్యోతి వెలిగిస్తున్న ట్వింకిల్‌ ఖన్నా

మగపిల్లల పెంపకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వారికి జీవితంలో ఎత్తుపల్లాలు చూపించాలని బాలీవుడ్‌ నటి ట్వింకిల్‌ ఖన్నా అన్నారు. పిల్లల జీవితాన్ని కఠినతరం చేయాలని, పడిలేచిన తర్వాత వారి భవిష్యత్‌ బలంగా ఉంటుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శవంతంగా ఉంటే వారు బాధ్యతగా ఉంటారన్నారు. గురువారం ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మరెన్నోవిషయాలను పంచుకున్నారు.

‘‘మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ, సామర్థ్యాన్ని పెంచేందుకు వర్క్‌షాప్‌లు, వివిధ కార్యక్రమాలను ఎఫ్‌ఎల్‌ఓ సభ్యుల కోసం నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే అనేక రంగాల్లో ప్రతిభ గల ట్వింకిల్‌ ఖన్నాను ఆహ్వానించామని ఎఫ్‌ఎల్‌ఓ హైదరాబాద్‌ చైర్‌పర్సన్‌ సోనా చత్వాని తెలిపారు.’’

సాక్షి, హైదరాబాద్‌: మహిళలు పురుషులతో పోటీ పడగలరా? అని ఎవరన్నా అంటే.. ఆమెను చూపించి ‘మగవారికంటే ఇంకా ఎక్కువే చేయగలరు’ అని తల ఎగరేసి చెప్పొచ్చు. ఒకటీ.. రెండూ కాదు.. దాదాపు తొమ్మిది రంగాల్లో ఆమె ‘స్టార్‌’గా వెలుగొందుతున్నారు. ఓ పక్క ఇల్లాలిగా ఇంటిని చక్కదిద్దుకుంటూనే తనకు నచ్చిన రంగాల్లో దూసుకెళుతున్నారు. ఆమే ‘ట్వింకిల్‌ ఖన్నా’. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి అలనాటి బాలీవుడ్‌ తారలు డింపుల్‌ కపాడియా, రాజేష్‌ ఖన్నాల కుమార్తె. హిందీ చిత్ర హీరో అక్షయ్‌ కుమార్‌ భార్య. ముక్కు సూటిగా మాట్లాడ్డం ఆమె స్వభావం, అందులో చమత్కారం జోడించటం ఆమె శైలి.  నటి, ఇంటీరియర్‌ డిజైనర్, కాలమిస్ట్, పుస్తకాలు, కథల రచయిత, చిత్ర నిర్మాత.. ఇలా ఆమె జాబితాలో ఎన్నో విజయవంతమైన కెరీర్‌లు ఉన్నాయి. గురువారం సోమాజిగూడలోని పార్క్‌ హోటల్‌లో ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ) నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్వింకిల్‌ ఖన్నా ‘ది ఫన్నీ సైడ్‌ ఆఫ్‌ లైఫ్‌’ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడారు. తన జీవిత కథను ఫిక్కీ లేడిస్‌తో పంచుకున్నారు. వారు అడిగిన అనేక ప్రశ్నలకు బదులిచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..  

‘నేను నా అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేస్తాను. నేను లౌకికవాదిని అని చెప్పడమే కాదు, అదే తీరులో మాట్లాడతాను. చెట్ల చుట్టూ పరుగెత్తడం విసుగొచ్చి చిత్రాల్లో నటించటం మానేశాను. మొదట అమ్మమ్మ ఇంటి దగ్గర చేపలు, రొయ్యలు అమ్మాను. కానీ అది రెండు వారాలు మాత్రమే. తర్వాత నేను ఇంటీరియర్‌ డిజైనర్‌గా మారి నటినయ్యాను. నేను తొమ్మిది రకాల కెరీర్‌లు మారాను. అసలైతే సీఏ కావలనుకున్నాను. కానీ అది జరగలేదు. నేను రచయితను అవుతానని చిన్నప్పుడే నాన్న అనేవారు. నాన్న ఇంటి నుంచి బయటికి వచ్చేశాక నేను, నా సోదరి కటిక నేలపై పడుకోవాల్సిన పరిస్థితి. మా నాన్న చిన్నప్పుడు పడి లేచిన అనుభవాలను మాతో పంచుకునేవారు. పిల్లలకు అలా చెప్పడమే సరైంది. మహిళలు కూడా ఎక్కువ పుస్తకాలు చదవాలి. వీలైనంత వైవిధ్యంగా చదవండి. తద్వారా వారు జీవితంలో అనేక విషయాలను, అవకాశాలను అందిపుచ్చుకోగలరు. 

అబ్బాయిలను అలా పెంచాలి..  
తల్లిదండ్రులు తమ కుమారులకు స్ఫూర్తివంతంగా నిలవాలి. పిల్లలు అన్ని పుస్తకాలను చదివేలా చేయాలి. వారి అవగాహన మరింత విçస్తృతం చేయడానికి విభిన్నమైన పుస్తకాలను ఇవ్వాలి. తల్లిదండ్రులు తమ కొడుకులతో ఇబ్బందికరమైన విషయాలతో సహా అన్ని విషయాలపై స్నేహపూర్వకంగా మాట్లాడాలి. తరువాతి తరంలో మగపిల్లలు ప్రాధమిక సంరక్షణ ఇచ్చేవారు అవుతారు. పిల్లల జీవితాన్ని కఠినతరం చేయాలి. ఎత్తుపల్లాలు చూశాక, పడిలేచిన తర్వాత వారి భవిష్యత్‌ బలంగా ఉంటుంది. వారు పడకపోతే, వారిని తన్నడం తప్పు కాదు. పడి లేచినప్పుడే వారు ధృడంగా మారతారు’ అంటూ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు