మందు కొట్టాడా..లేదా?

27 Aug, 2018 01:15 IST|Sakshi
బాధితుడు జహీరుద్దీన్‌ ఖాద్రి

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో ట్విస్ట్‌ 

మద్యం సేవించని యువకుడికి 43 బ్లడ్‌ ఆల్కహాల్‌ కౌంట్‌ 

సుల్తాన్‌బజార్‌ ట్రాఫిక్‌ పోలీసులపై యువకుడి ఫిర్యాదు

మద్యం తాగలేదంటూ ‘ఉస్మానియా’ మెడికల్‌ రిపోర్ట్‌

వివరాలు కోర్టుకు సమర్పిస్తాం: ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌  

హైదరాబాద్‌: ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించే ‘డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌’తనిఖీల్లో విచిత్రం చోటుచేసుకుంది. శ్వాస పరీక్ష యంత్రంతో ఓ యువకుడిని పరీక్షించగా మద్యం తాగినట్లు రీడింగ్‌ వచ్చింది. అదే యువకుడు శాంతిభద్రతల విభాగం పోలీసుల ద్వారా ఉస్మానియా ఆస్పత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకున్నాడు. అతడు మద్యం తాగలేదంటూ వైద్యులు తేల్చారు. వైద్యులు రక్తపరీక్షలు చేయలేదని, ఈ వ్యవహారాన్ని అభియోగపత్రాల్లో కోర్టుకు సమర్పిస్తామని సుల్తాన్‌బజార్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌రాజు తెలిపారు. శనివారం రాత్రి ఈ ఉదంతం చోటు చేసుకుంది వారాంతం నేపథ్యంలో సుల్తాన్‌బజార్‌ ట్రాఫిక్‌ పోలీసులు శనివారం రాత్రి కాచిగూడలోని ఐనాక్స్‌ వద్ద తనిఖీలు చేపట్టారు. రాత్రి 9.05 గంటల ప్రాంతంలో ఇన్నోవాలో వచ్చిన హాజిపుర వాసి సయ్యద్‌ జహిరుద్దీన్‌ ఖాద్రీని (21) ఆపి శ్వాసపరీక్ష యంత్రంతో తనిఖీ చేశారు. దీంతో యంత్రం రీడింగ్‌లో బ్లడ్‌ ఆల్కహాల్‌ కౌంట్‌ 43గా చూపింది. నిబంధనల ప్రకారం 35కంటే ఎక్కువ వస్తే అది ఉల్లంఘన కావడంతో ట్రాఫిక్‌ పోలీసులు జహీరుద్దీన్‌పై కేసు నమోదు చేశారు.

అయితే తాను మద్యం తాగలేదంటూ వాదించిన ఆయన మరోసారి పరీక్ష చేయమన్నారు. స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) ప్రకారం అలా చేయడం కుదరదని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే కోర్టులో సవాల్‌ చేసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. దీంతో జహీరుద్దీన్‌ నేరుగా సుల్తాన్‌బజార్‌ శాంతిభద్రతల విభాగం పోలీసుల్ని ఆశ్రయించి ట్రాఫిక్‌ పోలీసులపై ఫిర్యాదు చేశారు. దీంతో విధుల్లో ఉన్న ఎస్సై ఓ కానిస్టేబుల్‌ను ఇచ్చి జహీరుద్దీన్‌ను రాత్రి 11.35 గంటలకు ఉస్మానియా ఆస్పత్రికి పంపారు. రక్తపరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కిట్స్‌ అందుబాటులో లేకపోవడంతో విధుల్లో ఉన్న వైద్యులు జహీరుద్దీన్‌ నడక, కళ్ళు, మాటతీరు పరిశీలిం చడం ద్వారా మద్యం తాగలేదంటూ నివేదిక ఇచ్చారు. పోలీసులు తనపై ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేశారని జహీరుద్దీన్‌ ఆరోపిం చారు. దీనిపై ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌రాజు ’సాక్షి’తో మాట్లాడుతూ, ‘జహీరుద్దీన్‌కు నిబంధన ప్రకారమే పరీక్షలు నిర్వహించాం. మావద్ద ఉన్న ఆధారాలతో న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేస్తాం. అభ్యంతరాలు ఉంటే  కోర్టులో చాలెంజ్‌ చేయవచ్చు. వైద్యులు రక్తపరీక్షలు చేయాల్సి ఉండగా ఉస్మానియాలో అలా జరగలేదు’అని అన్నారు.  

మరిన్ని వార్తలు