‘గార్లకుంట’ గజ గజ

17 Dec, 2014 03:38 IST|Sakshi

రెండెకరాల్లో రియల్టర్ల పాగా
ప్లాట్లు చేస్తూ విక్రయూలు
స్థలం విలువ రూ. 3 కోట్లపైనే
నిద్ర నటిస్తున్న అధికార యంత్రాంగం

 
నేరుగా కుంటను ఆక్రమించేందుకు నామోషీ కాబోలు! మొదట దాని పక్క స్థలాన్ని కొంటారు. తీరిగ్గా కుంటను  కలుపుకుంటారు. తర్వాత ప్లాట్లు చేసి విక్రరుుస్తూ అమాయకులను బుక్ చేస్తారు. ఆమ్యామ్యాలతో అధికారులను కట్టడి చేస్తారు. ఎక్కడికక్కడ ఇలా పక్కాగా రియల్టర్లు కబ్జా పర్వాన్ని కొనసాగిస్తున్నారు. వీరి డబ్బు యూవకు గార్లకుంట ‘చిన్న’బోతోంది.
 
జనగామ :  పట్టణ శివారు ఏసిరెడ్డి నగర్ సమీపంలో గార్లకుంట ఉంది. 177 సర్వే నంబర్‌లోని ఈ కుంట విస్తీర్ణం 11.22  ఎకరాలని రెవెన్యూ రికార్డులు స్పష్టంచేస్తున్నారుు. ప్రస్తుతం ఇంత స్థలంలో కుంట లేదు. రెండు నుంచి మూడెకరాల స్థలం ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఆక్రమిత శిఖం భూముల విలువ సుమారు రూ. 3 కోట్లపైమాటే. ఆక్రమణలు, ఆపై ప్లాట్ల విక్రయూలతో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నా.. రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు అడ్డుకునే సాహసం చేయట్లేదు. కారణం.. కాసులు ముట్టడమేనని ఆరోపణలు విన్పిస్తున్నారుు.

హద్దులు చెరిగిన గార్లకుంట

రియల్టర్ల ధనదాహం ధాటికి గార్లకుంట హద్దులు చెరిగిపోయాయి. ఇటీవల రెవెన్యూ అధికారులు  హద్దుల కోసం ఓ వైపు కాల్వ తవ్వించగా కబ్జాదారులు కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఎఫ్‌టీఎల్(ఫీట్ ట్యాంకు లెవల్) నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఎఫ్‌టీఎల్ ప్రకారం.. కుంట సరిహద్దుకు 100 మీటర్ల దూరంలోని పట్టా భూముల్లోనైనా నిర్మాణాలకు అనుమతి ఉండదు. ఈ భూమిలోని రైతులు సాగు చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. కుంటలోకి నీరొచ్చే సమయంలో 100 మీటర్ల పరిధిలో ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో ఈ నిబంధన పెట్టారు. రియల్టర్లు దీన్నేమాత్రం ఖాతరు చేయట్లేదు. ఇప్పట్లో కుంటలు నిండే పరిస్థితి లేకపోవడాన్ని అదునుగా తీసుకుని కబ్జాకు పూనుకుంటున్నారు. కుంటల సమీపంలోని పట్టా భూములు కొని ప్లాట్లు చేస్తున్నారు. క్రమంగా కుంట స్థలాన్నీ ఆక్రమిస్తున్నారు. రెవెన్యూ అధికారుల అండదండలతో అంతా ‘సవ్యంగా’ సాగుతోంది. కానీ ప్లాట్లు కొన్న వాళ్లు చుక్కలు చూస్తున్నారు. నిర్మాణాలు.. తదితర అనుమతుల కోసం మళ్లీ భారీ మొత్తంలో ఖర్చు చేయూల్సి వస్తోంది.  
కబ్జా స్థలాన్ని కాపాడలేరా?

కుంట సమీపంలో ప్లాట్లకు గజానికి రూ. 4 వేల ధర చెబుతున్నారు. ఎకరాకు 4800 గజాలు తేలుతాయి. రెండెకరాలకు లెక్కేసినా ఎటు లేదన్నా కబ్జా స్థలం విలువ రూ. 3 కోట్లుపైనే ఉంటుందని రియల్ ఎస్టేట్ వర్గాలే చెబుతున్నారుు. ఇంత విలువైన స్థలాన్ని కాపాడేందుకు అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 ‘కుంట భూమి కొంత ఆక్రమణకు గురైనట్లు గుర్తించాం. దీన్ని ఆక్రమించిన వారి కోసం ఆరా తీస్తున్నాం. ఎఫ్‌టీఎల్ నిబంధనలు బేఖాతరు చేస్తూ చుట్టుపక్కల వారు ప్లాట్లు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. ఉన్నతాధికారులకు నివేదిస్తాం’ అని రెవెన్యూ అధికారులు వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు