దొంగలా.. ఉగ్రవాదులా..?

27 May, 2015 00:33 IST|Sakshi

 నకిరేకల్ పట్టణంలో ఇద్దరు దుండగులు మంగళవారం పిస్టల్‌తో హల్‌చల్ సృష్టించారు. వారి సమాచారం అందుకుని గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులపై పిస్టల్‌గురిపెట్టి బైక్‌పై పారిపోయారు. వీరు దొంగలా.. ఉగ్రవాదులా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమనుంచి తప్పించుకుని పారిపోయిన యువకులు దొంగలేనని పోలీసులు పేర్కొంటున్నారు.
 
 నకిరేకల్ :పట్టణంలో గుర్తుతెలియని దుండగులు పిస్టల్‌తో సంచరించడం సంచలనం సృష్టించింది. అయితే సదరు వ్యక్తులు దొంగలా..ఉగ్రవాదులా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం తమ నుంచి తప్పించుకుపోయిన ఇద్దరు యువకులు దొంగలేనని కొట్టిపారేస్తున్నారు. వివరాలు.. జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో ఇద్దరు యువకులు ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని నకిరేకల్ వైపు వైట్ కలర్ అపాచీ బైక్‌పై పరారైనట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఉన్నతాధికారులు నకిరేకల్ పోలీసులను అప్రమత్తం చేశారు.
 
 చిక్కినట్టే చిక్కి..
 దొంగల సమాచారం అందుకున్న నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు కేశవరెడ్డి, సతీష్‌లు బైక్‌పై సివిల్‌డ్రెస్‌లో మూసీ, హైవే రోడ్డు వెంట గాలింపు చర్యలు చేపట్టారు. ఆఫీసర్స్ కాలనీలో ఇద్దరు యువకులు వైట్‌కలర్ అపాచీపై సంచరిస్తున్నట్టు సమాచారం అందడంతో కానిస్టేబుళ్లు ఆ కాలనీ వైపు వెళ్లారు. ఆఫీసర్స్ క్లబ్ వెనుక సందులో నుంచి ఏపీ 13 ఆర్‌యూ 4379 నంబరు గల వైట్ కలర్ అపాచీపై వస్తున్న దుండగులను కానిస్టేబుళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాలనీలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొడంతో కిందపడిపోయారు. అపాచీ బైక్ నడుపుతున్న ఓ దుండగుడి కాలు బైక్‌లో ఇరుక్కుపోయింది. వెంటనే సివిల్ డ్రస్‌లో ఉన్న కానిస్టేబుళ్లు లేచి వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కానిస్టేబుళ్లు, దుండగుల మధ్య పెనుగులాట కూడా జరిగింది. ఈ క్రమంలో బైక్‌పై వెనుక కూర్చొని వచ్చిన దుండగుడు తన జేబులో నుంచి పిస్టల్‌ను తీసి కానిస్టేబుళ్లకు ఎక్కుపెట్టాడు. ప్రాణభయంతో భీతిల్లిపోయిన కానిస్టేబుళ్లు కాలనీలోని గృహాల వైపు పరుగుతీశారు. అనంతరం సదరు దుండగులు బైక్ తీసుకుని సూర్యాపేట వైపు పారిపోయారు.
 
 మళ్లీ.. అదే తప్పు..!
 ‘చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి’ అనే నానుడిని పోలీసు శాఖ వంటపట్టించుకున్నట్టు కనిపించడం లేదు. నిందితులను పట్టుకోవడంలో ఆ శాఖ అధికారుల డొల్లతనం మరోసారి ప్రస్పుటంగా వెల్లడైంది. రెండు మాసాల క్రితమే సూర్యాపేట, అర్వపల్లిలో ఆయుధాలు లేని కారణంగా ఆ శాఖ అధికారులు భారీ మూల్యమే చెల్లించుకున్న సంగతి తెలిసిందే.  అయితే ఇక్కడ కూడా దుండగుల గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఆయుధాలు లేకుండానే వారిని వెంబడించి ఖంగుతిని బతుకుజీవుడా  అంటూ పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక వేళ సదరు దుండగుడు పిస్టల్‌ను చూపించి మాత్రమే బెదిరించాడు. గురిపెట్టి కాల్చి ఉంటే మరో ఇద్దరు ఖాకీల ప్రాణాలు గాలిలో కలిసిపోయేవేనని స్థానికంగా చర్చజరుగుతోంది. ఈ ఘటన విషయం తెలుసుకుని ఆఫీసర్స్ కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు.
 
 డీఎస్పీ సందర్శన
 నకిరేకల్‌లో ఇద్దరు దొంగలు పిస్టల్‌తో వచ్చిన సంఘటన తెలుసుకున్న నల్లగొండ డీఎస్పీ రాములు నాయక్, స్థానిక సీఐ బాలకృష్ణ తన పోలీసుల బలగాలతో ఆఫీసర్స్ కాలనీని సందర్శించారు. దొంగలు బైక్ నుంచి కింద పడి పారిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. బైక్‌పై పరారైన ఈ ఇద్దరు దొంగల గ్యాంగ్‌గానే నిర్ధారించినట్లు డీఎస్పీ రాములు నాయక్ తెలి పారు. మహిళల మెడలో నుంచి గొలుసులను చోరీ చేసేందుకు కత్తులు, బొమ్మ పిస్టల్‌తో సంచరిస్తున్నారని డీఎస్పీ వెల్లడించారు. ఈ విషయంపై విచారణ జరిపి పారిపోయిన దొం గల ముఠాను పట్టుకుంటామన్నారు. కాగా, నకిరేకల్ వైపు బైక్ పై వస్తున్న ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు నకిరేకల్ మండలం మర్రూర్‌కు చెందిన  అన్నదమ్ములు షేక్ సయ్యద్‌మియా, షేక్ అబూ బఖర్ సూ ర్యా పేటలోని స్వరాజ్‌ట్రాక్టర్ షోరూంలో *26 వేలు చెల్లిం చేందుకు వస్తున్నారని తెలియడంతో విడిచిపెట్టారు.
 
 పట్టుకునే ప్రయత్నం చేశాం: కానిస్టేబుళ్లు కేశవరెడ్డి, సతీష్
 నకిరేకల్‌లో బైక్‌పై ఇద్దరు దొంగలు సంచరిస్తున్నట్లు తమకు సమాచారం రావ డంతో వెంటనే బైక్‌పై గాలింపు చర్యలు చేపట్టాం. మధ్యాహ్నం 12:20నిమిషాల సమయంలో ఆఫీసర్స్ కాలనీలోని ఆఫీసర్స్ క్లబ్ వెనక సందులో వెళ్తుండగా వారికి ఎదురుగా వెళ్లి పట్టుకునే ప్రయత్నం చేశాం. ఈ క్రమంలో దుండగులు, తాము బైక్‌లపై నుంచి కిందపడ్డాం. దొంగలను కూడా పట్టుకున్నాం. బైక్‌పై వెనక కూర్చున్న వ్యక్తి తన జేబులో నుంచి నల్లటి ఆకారంలో ఎదో బయటకు తీశాడు. వెంటనే మేము పక్కకు వెళ్లిపోయాం. ఆ తరువాత దొంగలు బైక్‌పై పరారయ్యారు.
 
 దుండగుల వయస్సు 30లోపే
 పట్టణానికి పిస్టల్‌తో వచ్చి పోలీసులపై గురి పెట్టి పరారైన దుండగులు 27-30 వయస్సు ఉన్నట్టు ఆఫీసర్‌‌స కాలనీవాసులు చెబుతున్నారు. దుం డగుల్లో ఒకరు జీన్స్ ప్యాంట్, వైట్ కలర్ షర్ట్ వేసుకుని గడ్డంతో  ఉన్నాడని, మరొకరు బైక్ నడుపుతూ ముఖానికి ముసుగు కట్టుకున్నాడని తెలి పారు. వారిలో ఒకడు పోలీసులపై కాల్చడానికి గురి పెట్టాడని,అది పేల కపోవడంతో పరారయ్యారని కాలనీకి చెందిన ఓ మహిళ తెలిపింది. ఇద్దరు ఎదో భాషలో మాట్లాడుతున్నారని కాలనీవాసులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు