టీఆర్‌ఎస్ మిత్రపక్షంగా బీఎస్పీ?

21 May, 2014 18:08 IST|Sakshi
టీఆర్‌ఎస్ మిత్రపక్షంగా బీఎస్పీ?

ఆదిలాబాద్: తెలంగాణలో ఖాతా తెరిచిన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) టీఆర్‌ఎస్ సర్కారుకు మిత్రపక్షంగా వ్యవహరించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు బీఎస్పీ ఎమ్మెల్యేలు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్), కోనేరు కోనప్ప (సిర్పూర్) గురువారం కేఆర్‌ఎస్‌ను కలిసి తమ మద్దతు ప్రకటించనున్నారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఆదిలాబాద్ జిల్లాలో బీఎస్పీ ఎమ్మెల్యేలిద్దరు విజయం సాధించిన విషయం విధితమే. ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకునే స్థాయిలో బీఎస్పీ జిల్లాలో బలంగా లేకపోయినప్పటికీ, ఈ ఇద్దరు నేతలు వ్యక్తిగత చరిష్మాతో విజయం సాధించారు.

కాగా, సర్కారు ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజారిటీ టీఆర్‌ఎస్‌కు ఉన్నప్పటికీ, ఆ పార్టీ ఎంఐఎం మద్దతు కోరుతోంది. అలాగే, బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్ సర్కారుకు మిత్రపక్షంగా ఉండాలని యోచిస్తుండటం గమనార్హం.  మరోవైపు నిర్మల్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పీఠాన్ని కూడా కైవసం చేసుకునే దిశగా బీఎస్పీ అడుగులు వేస్తోంది. ఇంద్రకరణ్‌రెడ్డి తన అనుచరులను బీఎస్పీ తరపున బరిలోకి దించిన విషయం విదితమే.

>
మరిన్ని వార్తలు