ఇద్దరు బీటెక్ విద్యార్థుల దుర్మరణం..

9 Jul, 2015 04:09 IST|Sakshi

 హయత్‌నగర్
 డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరు బీటెక్ విద్యార్థులను బలిగొంది. డీసీఎం వ్యాన్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పడంతో వెనుకే బైక్‌పై వేగంగా వస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులు దానిని ఢీకొట్టారు. ఇద్దరు విద్యార్థులు వ్యాన్ టైర్లకింద నలిగి మృతి చెందగా.. స్వల్పగాయాలకు గురైన మరో విద్యార్థి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... రాజేంద్రనగర్ మండలం కిస్మత్‌పూర్‌కు చెందిన శివరాజు మురళీధర్ కొడుకు హేమంత్ మణిదీప్ (20), కరీంనగర్‌జిల్లా సిరిసిల్లకు చెందిన కాశెట్టి నాగయ్య కొడుకు పద్మేందర్ (20), నల్లగొండ జిల్లా తుంగతుర్తికి చెందిన పి.యాదగిరి కొడుకు సాయికృష్ణ దేశ్‌ముఖిలోని సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ చింతల్‌కుంటలో అద్దెకుంటున్నారు.
 
  బుధవారం మధ్యాహ్నం బస్‌పాస్ దరఖాస్తు ఫారంపై సంతకం చేయించుకునేందుకు స్నేహితుడి బైక్ (ఏపీ12హెచ్ 1642)పై ముగ్గురూ చింతల్‌కుంట నుంచి బయలుదేరారు. పెద్దఅంబర్‌పేట జాతీయ రహదారిపై బలిజగూడ క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్ (ఏపీ28 వై 3004) బంక్‌లోకి ఒక్కసారిగా మలుపు తిరిగింది. దీంతో వెనుక వస్తున్న విద్యార్థుల బైక్.. డీసీఎంను ఢీకొట్టింది. ద్విచక్ర వాహనం కింద పడటంతో వాహనం వెనుక కూర్చున్న మణిదీప్, పద్మేందర్‌లు డీసీఎంవ్యాన్ వెనుక చక్రాల కింద పడిపోయారు. డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లడంతో వారిపై నుంచి వ్యాన్ చక్రాలు వెళ్లాయి.
 
 దీంతో మణిదీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ పద్మేందర్‌ను మొదట హయత్‌నగర్‌లోని సన్‌రైస్ ఆసుపత్రికి.. ఆ తర్వాత మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి గ్లోబల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. స్వల్పంగా గాయపడ్డ సాయికృష్ణ సన్‌రైస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడు మణిదీప్ తండ్రి ప్రైవేటు ఉద్యోగి కాగా... ఆయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో పెద్ద కొడుకు మణిదీప్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

మరిన్ని వార్తలు