ఆడుకునే వయస్సులో అనంత లోకాలకు..

16 Oct, 2019 08:12 IST|Sakshi
రజిత, మోక్షిత మృతదేహాలు

కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి జారిపడిన వైనం 

మాదారంలో విషాదఛాయలు

సాక్షి, హన్వాడ (మహబూబ్‌నగర్‌): ఆడుతూ.. పాడుతూ పాఠశాలకు వెళ్లి వచ్చే ఆ చిన్నారులు దసరా సెలవులు ఉండటంతో సరదాగా తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లారు.. అయితే పొలంలో నీటి నిల్వ కోసం తోడిన గుంతలో ఈతకు వెళ్లి ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన మండలంలోని మాదారంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే... గ్రామానికి చెందిన కొల్లి సాయన్న, అంజమ్మ దంపతుల కూతుళ్లు రజిత(11), మోక్షిత(4)లు. వీరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రజిత ఐదో తరగతి, మోక్షిత ఒకటో తరగతి చదువుతున్నారు.

దసరా సెలవులు పొడిగింపు కారణంగా పాఠశాలకు వెళ్లాల్సిన ఆ చిన్నారులు మంగళవారం తల్లిదండ్రుల వెంట గ్రామ సమీపంలోని పొలానికి వెళ్లారు. ఈ క్రమంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి తమ పొలంలోనే ఉన్న నీటి నిల్వ గుంతలో జారిపడి మృత్యువాత పడ్డారు. పక్కనే పొలం పనుల్లో నిమగ్నమైన తల్లిదండ్రులు గుర్తించి వెంటనే నీటి గుంతలోకి దిగి బాలికలను బయటికి తీయగా అప్పటికే ఆ చిన్నారులు విగతజీవులయ్యారు. దీంతో బాధిత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ రోదించారు.

చిన్నారుల మృత్యువాతతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొల్లి సాయన్న, అంజమ్మ దంపతులకు ముగ్గురు ఆడ సంతానంలో ఇద్దరు బాలికలు మృత్యువాత పడగా మరో అమ్మాయి ఉంది. విషయం తెలుసుకున్న మండల రెవెన్యూ అధికారులు, పోలీసులు శవ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా