పంటలు పండక.. అప్పులు తీర్చలేక

2 Mar, 2017 16:35 IST|Sakshi
పంటలు పండక.. అప్పులు తీర్చలేక

► అప్పులపై బెంగతో రైతు బలవన్మరణం
► పొలంలో పురుగుల మందుతాగి అఘాయిత్యం


జడ్చర్ల : ఎంతో ఆశతో విత్తనాలు వేశాడు.. ఈ సారైనా కాలం కలిసి వస్తుందని ఆశపడ్డాడు. కానీ కరువు రైతును కాటేసింది.  పంటలు ఎండిపోయి అప్పులు మీదపడ్డాయి. పాతవి, కొత్తవి కలిసి తడిసి మోపెడు కావడంతో అప్పులిచ్చిన వారికి ఏం సమాధానం చెప్పాలని రోజు బెంగపడేవాడు. చివరికి పొలంలోనే పురుగులమందుతాగి తనువుచాలించాడు. ఈ విషాదకరమైన సంఘటన మండల పరిధిలోని గంగాపూర్‌ గ్రామ శివారులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాలిలా..మిడ్జిల్‌ మండల కేంద్రానికి చెందిన సాకలి దేవయ్య(50)కు నాలుగు ఎకరాల పొలం ఉంది. ఈ సారి 6 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేశాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటల  దిగుబడి అంతంతమాత్రంగానే వచ్చి తీవ్రంగా నష్టపోయాడు. గత ఏడాది చేసిన అప్పును ఈ పంటలతో తీరుద్దామనుకుంటే ఈ ఏడాది కూడా నష్టం రావడంతో సుమారుగా రూ.4లక్షల వరకు అప్పులయ్యాయి.

కుమిలిపోయి ఆత్మహత్య: అప్పులు ఎలా తీర్చాలని రోజు దేవయ్య కుమిలిపోయేవాడు. చేతిలో చిల్లిగవ్వలేదు.. కూతురు పెళ్లి ఎలా చేయాలని భార్య చిట్టెమ్మతో చెప్పుకుని బెంగపడేవాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఉదయం పొలానికి వెళ్లొస్తానంటూ బయటకు వెళ్లి సాయంత్రం దాకా తిరిగి రాలేదు. బుధవారం గంగాపూర్‌ గ్రామం శివారులోగల ఓ వ్యవసాయ పొలంలో విగతజీవిగా పడి కనిపించాడు. చుట్టుపక్కల రైతులు గమనించి అతని దగ్గర లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహం పక్కనే ఖాళీ పరుగుల మందు డబ్బా ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానించి పోలీసులకు తెలిపారు. సంఘటన స్థలంలో పంచనామా నిర్వహించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య చిట్టెమ్మతో పాటు కూతురు, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ శ్రీనివాస్‌రావు తెలిపారు

అనంతపురంలో యువ రైతు, గద్వాల క్రైం : మండలంలోని అనంతపురం గ్రామానికి చెందిన క్రాంతి(23) అనేరైతు అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. గత సంవత్సరం పంటకోసం రూ.2లక్షల అప్పుగా తీసుకున్నాడు. సరైయిన దిగుబడి రాకపోవడంతో పంటకు తీసుకవచ్చిన డబ్బులు తీర్చలేక మానోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో  పురుగుమం దు తాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. కాసేపటి తర్వాత  గమనించిన క్రాంతి తల్లిదండ్రులు చిక్సిత నిమిత్తం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూల్‌కు తరలిస్తుండగ చనిపోయా డు. తల్లిదండ్రులు కమలమ్మ, దేవరాజు ఫి ర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా