పైపుల్లో 14 కేజీల పసిడి

13 Dec, 2019 02:09 IST|Sakshi

రూ.5.46 కోట్ల విలువ చేసే బంగారం పట్టివేత

ఇద్దరు విదేశీయుల అరెస్టు

శంషాబాద్‌: పైపుల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు విదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. దుబాయ్‌ నుంచి వస్తున్న ఎయిరిండియా విమానం ఏఐ–952 గురువారం తెల్లవారుజామున 5.30కి శంషాబాద్‌ విమానాశ్రయం లో దిగింది. బంగారం అక్రమ రవాణా గురించి విశ్వసనీయ సమాచారం రావడంతో అప్రమత్తమైన అధికారులు.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

వీరు తాము కూర్చున్న 31ఏ, 32ఏ సీట్ల కింద బంగారాన్ని తెచ్చినట్లు గుర్తించారు. నల్లని టేపుతో చుట్టిన బంగారాన్ని 14 హాలో పైపుల్లో దాచినట్లు అధికారులు తెలిపారు. పైపుల నుంచి 112 బంగారు బిస్కెట్‌ ముక్కలను బయటకు తీశారు. మొత్తం 14 కేజీల బరువు కలిగిన ఈ బంగారం విలువ రూ.5.46 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్న వారిలో ఒకరు దక్షిణ కొరియాకు చెందిన వ్యక్తి కాగా మరొకరు చైనాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ఇంత భారీ మొత్తంలో వీరితో బంగారాన్ని అక్రమంగా రవాణా చేయించింది ఎవరనే విషయంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులిద్దరిని అరెస్ట్‌ చేశారు. ఘటనపై కేసు నమోదు చేశారు. కాగా, ఐదేళ్ల క్రితం దుబాయ్‌ నుంచి వచ్చిన ముగ్గురి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు 27 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడేళ్ల క్రితం 9 కేజీల బంగారాన్ని మరో వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఇద్దరు వ్యక్తుల నుంచి బంగారం స్వాధీనం చేసుకోవడం చర్చనీయాశమైంది.

>
మరిన్ని వార్తలు