డెంగీ పంజా

3 Sep, 2019 11:52 IST|Sakshi
పర్హీన్‌ (ఫైల్‌) ,ఆశ్రిత (ఫైల్‌ఫొటో)

ఇద్దరు బాలికలు మృతి

మణికొండ: సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రజలు వ్యాధుల బారినపడి ఆస్పత్రుల బాట పట్టారు. ఈ క్రమంలో డెంగీ పంజా విసురుతోంది. తీవ్ర జ్వరం బారినపడిన ప్రజలు మంచాన పడ్డారు. డెంగ్యూతో బాధపడుతూ ఆదివారం ఒక్కరోజే ఇద్దరు బాలికలు మృతిచెందారు. తాండూరులో ఒక బాలిక, నార్సింగిలో మరో బాలిక డెంగీకి బలయ్యారు. దీంతో వ్యాధుల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నార్సింగి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన బాలిక పర్హీన్‌ (15) శుక్రవారం నుంచి జ్వరంతో బాధపడుతోంది. సాధారణ జ్వరమేనని భావించి తల్లితండ్రులు తగ్గిపోతుందని అనుకున్నారు. అయితే శనివారం తీవ్ర జ్వరం రావడంతో స్థానికంగా ఓ వైద్యుడికి చూపించారు. ఆ వైద్యుడు రాసిన మందులు బాలిక వేసుకుంది. అయితే ఆదివారం ఆమె పరిస్థితి విషమించడంతో మృతిచెందింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే బాలిక మృతి చెందిన తరువాత రిపోర్టులు వచ్చాయి. రిపోర్టుల్లో డెంగీ సోకిందని ఉంది. ఈ విషయం తెలియక తల్లిదండ్రులు తమ కూతురును కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

తాండూరులో..
తాండూరు టౌన్‌: డెంగీతో బాధపడుతూ 11 ఏళ్ల విద్యార్థిని మృతిచెందింది. వికారాబాద్‌ జిల్లా తాండూరులోని సీతారాంపేట్‌కు చెందిన రాంచందర్‌ కూతురు ఆశ్రిత (11) గాంధీనగర్‌ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. ఇటీవల తీవ్ర జ్వరం బారిన పడడంతో తాండూరులోని ఆస్పత్రిలో వైద్యం చేయించారు. ఎంతకూ తగ్గకపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా చికిత్స పొందుతున్న బాలిక శనివారం రాత్రి మృతిచెందింది. ఎప్పుడూ చలాకీగా ఉండే పాప మరణించడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. గతంలోనే భార్యను కోల్పోగా ఇప్పుడు కూతురు కూడా మరణించడంతో తండ్రి రాంచందర్‌ కుంగిపోయాడు. 

మరిన్ని వార్తలు