జిల్లాలు.. 33

31 Jan, 2019 04:19 IST|Sakshi

కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటు

నెల క్రితం ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

అభ్యంతరాలకు బుధవారంతో ముగిసిన తుది గడువు

ఒకట్రెండు రోజుల్లో రెండు జిల్లాల ఏర్పాటుపై ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ భౌగోళిక స్వరూపం మళ్లీ మారుతోంది. మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఈ రెండు జిల్లాల ఏర్పాటుపై నెల రోజులుగా అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించే ప్రక్రియ జరిగింది. బుధవారంతో ఇది ముగిసింది. ప్రాథమిక నోటిఫికేషన్‌లో ఎలాంటి మార్పులు లేకుండానే ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటు పూర్తి కానుంది.

ఒకట్రెండు రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయనుంది. అనంతరం ఈ రెండు జిల్లాలు మనుగడలోకి వస్తాయి. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు పెరగనుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జిల్లాల పునర్విభజన మొదలైంది. 2016, అక్టోబర్‌ 11న కొత్తగా 21 జిల్లాలు ఏర్పాటయ్యాయి. తాజాగా రెండు జిల్లాలు ఏర్పాటవుతున్నాయి. ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటుపై డిసెంబర్‌ 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ భూపాలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రాథమిక నోటిఫికేషన్‌పై 30 రోజులపాటు అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా కలెక్టర్లు ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేశారు. నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు, సూచనలు ఇచ్చే గడువు పూర్తయ్యింది. ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎలాంటి అభ్యంతరాలు రానట్లు తెలుస్తోంది. దీంతో కొత్తగా రెండు జిల్లాల ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ కానున్నాయి. 

మరో నాలుగు మండలాలు...
రెండు కొత్త జిల్లాలతోపాటు నాలుగు మండలాలను ఏర్పాటు చేస్తూ నెల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్‌ జిల్లాలో చండూరు, మోప్రా, మేడ్చల్‌ జిల్లాలో మూడుచింతలపల్లి, సిద్దిపేట జిల్లాలో నారాయణరావుపేట మండలాలను కొత్తగా ఏర్పాటు చేసింది. అలాగే ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలిపేలా ఉత్తర్వులు జారీ చేసింది. వీటిపైనా ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేయనుంది.

కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 585 మండలాలు ఉన్నాయి. జిల్లాల పునర్విభజన సమయంలో ప్రభుత్వం కొత్తగా 125 మండలాలను ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటయ్యే నాలుగు మండలాలతో కలిపి రాష్ట్రంలోని మొత్తం మండలాల సంఖ్య 589కి పెరగనుంది. అలాగే రాష్ట్రంలో మొదట 38 రెవెన్యూ డివిజన్లు ఉండేవి. జిల్లాల పునర్విభజన సమయంలో వీటి సంఖ్య 69కి పెరిగింది. ఇదిలా ఉండగా... కొత్తగా కోరుట్ల, జోగిపేట, కొల్లాపూర్, ఖానాపూర్‌ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ములుగు జిల్లా: ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం(కె), వాజేడు మండలాలు. ప్రస్తుతం ఇవి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిధిలో ఉన్నాయి.

నారాయణపేట జిల్లా: దామరగిద్ద, ధన్వాడ, కోస్గి, కృష్ణ, మద్దూరు, మాగనూరు, మక్తల్, మరికల్, నారాయణపేట, నర్వ, ఊట్కూరు, కోయిల్‌కొండ మండలాలు. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు