అందుబాటులోకి మరో రెండు అర్బన్‌ పార్క్‌లు 

31 Aug, 2019 02:50 IST|Sakshi
జటాయు అర్బన్‌ పార్కును ప్రారంభించిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, మల్లారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మహానగర వాసులకు మరో రెండు అటవీ ఉద్యానవనాలు (అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు) అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం మేడ్చల్‌ జిల్లాలోని దమ్మాయిగూడలో ఆరోగ్య వనం, మేడిపల్లిలో జటాయు పార్క్‌లను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఒత్తిడిని అధిగమించేందుకు, యాంత్రిక జీవనం నుంచి కొద్దిసేపు ఆటవిడుపుగా గడిపేందుకు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌లు దోహదం చేస్తాయని ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నగరంలో స్వచ్ఛమైన గాలికోసం హైదరాబాద్‌కు నలువైపులా ప్రభుత్వం ‘అర్బన్‌ లంగ్‌ స్పేస్‌’పేరిట రిజర్వ్‌ ఫారెస్టులను అభివృద్ధి చేస్తోందన్నారు. దమ్మాయిగూడలో 298 హెక్టార్ల రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఏరియాలో రూ.74 లక్షల వ్యయంతో బెంచ్‌లు, వాటర్‌ హార్వెస్టింగ్‌ స్ట్రక్చర్స్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ పార్కుల్లో ఫుడ్‌ కోర్ట్, ఓపెన్‌ జిమ్, చిల్డ్రన్‌ గేమ్‌జోన్‌ ఏరియా ఏర్పాటు చేస్తామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, అదనపు పీసీసీఎఫ్‌లు స్వర్గం శ్రీనివాస్, పర్గెయిన్, మేడ్చల్‌ జిల్లా అటవీ శాఖ అధికారి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు