స్నేహితుడి కోసం హత్య.. ఆపై స్నేహితుడి హత్య

27 Jul, 2018 11:33 IST|Sakshi
వివవివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నల్లమల రవి  

జహీరాబాద్‌ టౌన్‌ మెదక్‌ : స్నేహితుడి కోసం ఒకరిని హత్యచేసి, నేరం తప్పించుకునేందుకు అదే స్నేహితుడి హత్య.. ఇదేదో క్రైం సినిమా స్టోరీ కాదు.. ఇటీవల జహీరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఇద్దరు యువకుల మృతి వెనుక దాగి ఉన్న మిస్టరీ. మొగుడంపల్లి మండలం మాడ్గికి చెందిన మొహ్మద్‌ మోహిజోద్దీన్‌(22), సద్దాం(ఇస్మాయిల్‌)(26) ఈ నెల 14న గ్రామం నుంచి జహీరాబాద్‌కు టీవీ రిపేర్‌ చేయించడానికి వెళ్లి ఈ నెల 19న బావిలో శవాలై కనిపించిన విషయం తెలిసిందే.

ఎట్టకేలకు ఈ కేసును ఛేదించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. జహీరాబాద్‌ డీఎస్పీ నల్లమరి రవి తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గి గ్రామానికి చెందిన మొహ్మద్‌ మోజోద్దీన్‌ వద్ద సద్దాం రూ. 3 లక్షలు అప్పు తీసుకున్నాడు. తీసుకున్న డబ్బు తిరగి ఇవ్వాలని మోహీజోద్దీన్‌ సద్దాంపై ఒత్తడి తెచ్చాడు. దీంతో అదే గ్రామానికి చెందిన జావీద్‌ అనే స్నేహితుడికి  సద్దాం అప్పు విషయం తెలిపాడు. అప్పు నుంచి తప్పించుకునేందుకు మోహిజోద్దీన్‌ను హత్య చేయాలని జావీద్, సద్దాం  కుట్రపన్నారు.

టీవీ మరమ్మతుల నిమిత్తం ఈ నెల 14న మాడ్గి నుంచి సద్దాం, మోహిజోద్దీన్‌ బుల్లెట్‌పై జహీరాబాద్‌కు వచ్చారు. టీవీని మరమ్మతుల కోసం ఓ షాప్‌లో ఇచ్చి పట్టణంలోని మూసనగర్‌లో ఉంటున్న జావీద్‌ ఇంటికి చేరుకున్నారు. బుల్లెట్‌ బైక్‌ అక్కడే ఉంచి జావీద్‌కు చెందిన కారులో ముగ్గురు కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ముందే పథకం రచించిన జావీద్, సద్దాంలు మొహిజోద్దీన్‌ను అల్గోల్‌ చౌరస్తా వద్ద గల పాడుబడిన బావి వద్దకు తీసుకెళ్లి  మధ్యాహ్నాం సమయంలో అందులో తోశారు.

అక్కడి నుంచి ఇద్దరు జావీద్‌ ఇంటికి చేరుకున్నారు. మోహిజోద్దీన్‌ హత్య విషయం బయటకు తెలిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో జావీద్‌ సద్దాంను హత్య చేయాలనుకున్నాడు. ఈ మేరకు సద్దాంకు విపరీతంగా మద్యం తాగించి మోహిజోద్దీన్‌ పరిస్థితిని చూసొద్దామని సాయంత్రం 7 గంటల ప్రాంతంలో సద్దాంను కారులో అదే బావి వద్దకు తీసుకెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న సద్దాం కాళ్లను తాడుతో కట్టేసి అదే బావిలో తోసేసి జావీద్‌ పరారయ్యాడు.

సీసీ కెమెరాల ఆధారంగా కేసును చేధించిన పోలీసులు, గురువారం ఉదయం నిందితుడు జావెద్‌ను అరెస్టు చేశారు. నిందితుడు ఈ విషయాన్ని ఒప్పుకున్నాడని డీఎస్పీ తెలిపారు. అతని వద్ద మృతులకు సంబంధించిన సిమ్‌కార్డులు, నిందితుడి కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. విలేకరుల సమావేశంలో జహీరాబాద్‌ టౌన్‌ సీఐ సైదేశ్వర్, ఎస్‌ఐలు సత్యనారాయణ, ప్రభాకర్‌రావు, విజయ్‌ కుమార్‌ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు