మరో రెండు కరోనా అనుమానిత కేసులు

31 Jan, 2020 02:09 IST|Sakshi

గాంధీలో ఒకటి.. ఫీవర్‌లో మరొకటి

ఫీవర్‌ నుంచి ముగ్గురు డిశ్చార్జ్‌

కేరళలో పాజిటివ్‌ కేసు నమోదుతో నగరంలో ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నగరంలో కలకలం సృష్టిస్తోంది. కరోనా వైరస్‌ లక్షణాలతో బాధపడుతూ ఓ యువకుడు(29) ఫీవర్‌ ఆస్పత్రిలో చేరాడు. అలాగే ఇటీవలే చైనా నుంచి హైదరాబాద్‌ చేరుకున్న మియాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి (39) తీవ్రమైన జ్వరం, జలుబుతో బాధపడుతూ చికిత్స కోసం స్థానిక వైద్యులను సంప్రదించగా వారు గాంధీ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. దీంతో ఆయన గురువారం ఉదయం గాంధీ ఆస్పత్రికి చేరుకున్నాడు. బాధితుడిని కరోనా ఐసోలేషన్‌ వార్డులో అడ్మిట్‌ చేసి వైద్యసేవలు అందిస్తున్నారు. ఆయన నుంచి నమూనాలు సేకరించి పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు.

అయితే సదరు వ్యక్తికి కరోనా వైరస్‌ లక్షణాలు లేవని, కేవలం వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నాడని, వదంతులు నమ్మవద్దని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఇక దేశంలో తొలి కేసు కేరళలో నమోదు కావడంతో హైదరాబాద్‌లోనూ వైరస్‌ వెలుగు చూసే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ ఆందోళన చెందుతోంది. ఆ మేరకు చైనా నుంచి రాష్ట్రానికి చేరుకున్న ప్రతి ఒక్కరిని విధిగా పరీక్షించాలని నిర్ణయించింది. సాధారణ జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారు కూడా తమకు కరోనా వైరస్‌ సోకిందేమోనని అనుమానంతో ఆందోళన చెందుతున్నారు. చికిత్సల కోసం గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు చైనా నుంచి ఇటీవల హైదరాబాద్‌ చేరుకున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానితులను ఇప్పటికే ఫీవర్‌లో అడ్మిట్‌ చేసి, వారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా నెగిటివ్‌ రిపోర్ట్‌ రావడంతో గురువారం వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు.

మరిన్ని వార్తలు