నగరంలో ఢిల్లీ తరహా అల్లర్లకు కుట్ర 

1 Apr, 2020 02:00 IST|Sakshi

ప్రార్థన స్థలంపై కిరోసిన్‌ బాంబులతో దాడి

ఇద్దరు యువకుల్ని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌

సాక్షి, హైదరాబాద్‌: సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన తరహాలో నగరంలోనూ అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించిన ఇద్దరు యువకుల్ని దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పట్టుకుంది. సిటీలో మత ఘర్షణలు రేపేందుకు వీరు ఓ ప్రార్థన స్థలంపై 3 కిరోసిన్‌ బాంబులు విసిరారు. అంతకుముందే రెండు ఏటీఎంలకు నిప్పుపెట్టగా, ఆర్టీసీ బస్సు దగ్ధానికి యత్నించారు. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న ఓ వివాదాస్పద వ్యక్తి ప్రసంగాలతో ప్రేరణ పొందిన వీరిద్దరూ ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ఫీడ్‌ ఆధారంగా వీరిని పట్టుకున్నారు.

ప్రసంగాలతో స్ఫూర్తిపొంది.. 
రియాసత్‌నగర్‌కు చెందిన అర్షద్, హఫీజ్‌బాబానగర్‌కు చెందిన వసీ స్నేహితులు. ఒకరు చిరువ్యాపారి కాగా, మరొకరు విద్యార్థి. వీరిద్దరు స్మార్ట్‌ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్‌లో ఓ వివాదాస్పద వ్యక్తి ప్రసంగాలు చూసేవారు. వాటి ద్వారా స్ఫూర్తి పొంది..తాము ఏదో ఒక సంచలనం సృష్టించాలని ఆలోచించేవారు. ఈ క్రమంలోనే ఓసారి మిథాని డిపోలో ఆర్టీసీ బస్సును దగ్ధం చేయడానికి, ఫిబ్రవరి 11న చాంద్రాయణగుట్ట చౌరస్తాలోని రెండు ఏటీఎంలకు నిప్పు పెట్టడానికి యత్నించారు. ఇటీవల సీఏఏ, ఎన్నార్సీలపై ఢిల్లీలో జరిగిన ఘర్షణల వంటివి హైదరాబాద్‌లోనూ సృష్టించాలని కుట్రపన్నారు. రెండు వర్గాల మధ్య మత ఘర్షణ సృష్టిస్తేనే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పథకం వేశారు.

ఈ క్రమంలో ఈ నెల మొదటి వారం నుంచి వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై తిరుగుతూ అనేక ప్రాంతాల్లో రెక్కీ చేశారు. మాదన్నపేటలోని ఓ ప్రార్థన స్థలాన్ని టార్గెట్‌గా చేసుకుని, గత నెల 14 రాత్రి అక్కడకు వెళ్లి మూడు కిరోసిన్‌ బాంబులు విసిరారు. అవి పేలకపోవడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ ఘటనలపై స్థానిక పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రంగంలోకి దిగిన దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.. పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించి, అనుమానితుల వాహనం నంబర్‌ గుర్తించారు. దీని ఆధారంగా ప్రత్యేక టీమ్‌ సోమవారం రాత్రి అర్షద్, వసీని పట్టుకుంది. వీరి నుంచి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతాలకు అర్షద్‌.. వసీని ప్రేరేపించాడని పోలీసులు గుర్తించారు.

మరిన్ని వార్తలు