చెప్పిందొకటి.. చేసేదొకటి

3 May, 2015 01:21 IST|Sakshi

- ఇద్దరు సీఎంలపై పొంగులేటి ధ్వజం
- అన్ని స్థానాల్లోనూ పోటీ
- శేరిలింగంపల్లిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల శంఖం పూరించిన వైఎస్సార్ సీపీ
సాక్షి,సిటీబ్యూరో:
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలకు తిలోదకాలిచ్చారని, ప్రస్తుతం వారి పాలనను ప్రజలు గమనించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం చందానగర్‌లోని హూడా గ్రౌండ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుడ్ల ధనలక్ష్మీ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కె. సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పొంగులేటి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు.

ఎయిర్‌పోర్టు మొదలుకొని...ఫైఓవర్లు..ఔటర్ రింగ్ రోడ్డు లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆయన హయాంలోనే పూర్తయ్యాయన్నారు. ఆయన ఆశయ సాధనకు ఏర్పడిన వైఎస్సార్ సీపీ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. త్వరలో జరుగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్‌ల్లో వైఎస్సార్ సీపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. దివంగత మహానేత వైఎస్సార్ పాలనలో పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలను ఆదరించారని గుర్తు చేశారు. నగరంలోని సీమాంధ్రులకు తాము రక్షణగా ఉంటామని,  తెలంగాణ బిడ్డలకు ఏ కష్టం వచ్చిన అండగా ఉండి ఆదుకుంటామన్నారు.  

హైదరాబాద్ నగర అభివృద్ధికి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ తన పాలనలో నగరాభివృద్ధికి కృషి చేస్తూనే, తెలంగాణలోని రైతులను ఆదుకునేందుకు ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారన్నారు. నగర వాసులకు భూగర్భ డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని ఆయన ఎంతో కృషి చేశారన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి  కె. శివకుమార్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి పరిధిలోని ఆరు డివిజన్లలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షుడు ముజ్‌తబ అహ్మద్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఆయన ఆశయ సాధనకోసం ఉద్భవించిన వైఎస్సార్ సీపీకి అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలని కోరారు. కార్మిక విభాగం అధ్యక్షుడు నర్రా బిక్షపతి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్‌కు అండగా నిలిచిన జేఏసీలు ఇప్పు డు ఆయనను దించాలని కోరుతున్నాయన్నారు.  నాయకులు మతిన్, సత్యం శ్రీరంగం,  భవానీ చౌదరి,రాంమనోహర్, గోపాలరావు, సిద్దార్థరెడ్డి, భీష్వ రవీందర్, జార్జి హెర్బర్ట్ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా