ఇద్దరు సీఎంలూ పక్కపక్కనే: నరసింహన్

21 Mar, 2014 02:48 IST|Sakshi
ఇద్దరు సీఎంలూ పక్కపక్కనే: నరసింహన్

* రెండు రాష్ట్రాల పాలనా సచివాలయం నుంచే
* ఏర్పాట్లపై గవర్నర్ నరసింహన్ ఆదేశాలు
* తెలంగాణ ముఖ్యమంత్రికి సీ బ్లాక్
* ఆంధ్రప్రదేశ్ సీఎంకు సౌత్ హెచ్ బ్లాక్
* రెండు ప్రభుత్వాల ఉద్యోగులకు బ్లాకుల విభజన
* అమృత క్యాజిల్ గేటు నుంచి తెలంగాణ సీఎం
* లుంబిని పార్కు కొత్త గేటు నుంచి ఏపీ సీఎం..
* సీఎం క్యాంపు కార్యాలయం తెలంగాణ సీఎంకు
* ఏపీ సీఎం అధికార నివాసం గ్రీన్‌ల్యాండ్ గెస్ట్‌హౌస్
* అసెంబ్లీలోనే రెండు శాసనసభల సమావేశాలు
* హైదర్‌గూడ క్వార్టర్లు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు
* ఆదర్శనగర్ క్వార్టర్లు తెలంగాణ ఎమ్మెల్యేలకు
* నెలాఖరుకల్లా పూర్తి ప్రతిపాదనలకు ఆదేశం

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అమలులోకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ప్రస్తుత సచివాలయం నుంచే పాలనా కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. జూన్ 2వ తేదీ నుంచి ఉమ్మడి రాజధాని గ్రేటర్ హైదరాబాద్‌లో ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పనిచేయడానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై గవర్నర్ తొలిసారిగా దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి శ్యాంబాబులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అధికారులతో సమావేశమై సమీక్షించారు.
 
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు హైదరాబాద్ నుంచే పరిపాలన సాగించటానికి ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులనే సమకూర్చాలని, ఎటువంటి కొత్త నిర్మాణాలను చేపట్టరాదని నిర్ణయించారు. ఎక్కడైనా అత్యవసరమైన పక్షంలో ఉన్న భవనాల్లోనే అదనపు వసతులను కల్పించాలని స్పష్టంచేశారు. ఈ నెలాఖరు కల్లా పూర్తి స్థాయిలో చేపట్టాల్సిన చర్యలతో ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా గవర్నర్ నిర్దేశించారు. ప్రాథమికంగా జరిగిన కసరత్తు, అధికారుల ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి.
 
*  రెండు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రస్తుతం ఉన్న సచివాలయం నుంచే తమ తమ రాష్ట్రాల పరిపాలన కొనసాగిస్తారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సీ బ్లాక్‌లోని సీఎం కార్యాలయాన్ని తెలంగాణ సీఎంకు కేటాయిస్తారు. మొన్నటి వరకు డిప్యూటీ ముఖ్యమంత్రి కార్యాలయంగా ఉన్న సౌత్ హెచ్ బ్లాక్‌లోని మూడో అంతస్థుతో పాటు ఆ మ్తొతం బ్లాక్‌ను ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) ముఖ్యమంత్రికి, ఆయన కార్యాలయ అధికారులకు కేటాయిస్తారు. సౌత్ హెచ్ బ్లాక్‌లోనే సీఎస్ కార్యాలయంతో పాటు మంత్రివర్గ సమావేశ మందిరాన్ని నిర్మిస్తారు.
 
*  ప్రస్తుతం సచివాలయానికి రాకపోకలకు రెండు వైపులా రెండేసి గేట్లు ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఉద్యోగుల రాకపోకలకు అమృత క్యాజల్ హోటల్ ఎదురుగా గల పాత గేటును ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఉద్యోగుల రాకపోకలకు లుంబినీ పార్కు ఎదురుగా గల కొత్త గేటును ఉపయోగిస్తారు.
 
*  సచివాలయంలోని ఏ, బీ, సీ, డీ బ్లాక్‌లను లేదా ఏ, బీ, సీ, ఎల్ బ్లాక్‌లను తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జే, కే, ఎల్, హెచ్ బ్లాకులు రెండు కేటాయిస్తారు. ఎల్ బ్లాక్ కోసం తెలంగాణ ఉద్యోగుల నుంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఎల్ బ్లాకును తెలంగాణకు కేటాయిస్తే డీ బ్లాక్‌ను ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు కేటాయిస్తారు.
 
*  ప్రస్తుత అసెంబ్లీ ఆవరణలోనే ఇరు రాష్ట్రాల శాసనసభ సమావేశాలను నిర్వహిస్తారు. బహుశా పాత అసెంబ్లీ భవనంలో తెలంగాణ ప్రభుత్వ సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా అదనపు సౌకర్యాలను కల్పిస్తారు. కొత్త అసెంబ్లీ భవనంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమావేశాలు నిర్వహిస్తారు. ప్రస్తుత శాసన మండలిని తెలంగాణ శాసనమండలి సమావేశాలకు కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలకు అక్కడే అవసరమైతే కొత్త నిర్మాణాన్ని చేపట్టాలా లేదా అనే విషయాన్ని ఎన్నికైన ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
 
*  ప్రస్తుతం గ్రీన్‌ల్యాండ్స్‌లో ముఖ్యమంత్రి అధికార నివాసాన్ని, క్యాంపు కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాసంగా కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికార నివాసంగా గ్రీన్‌ల్యాండ్స్ అతిథి గృహాన్ని సిద్ధం చేస్తారు. అవసరమైన అదనపు వసతులను అక్కడ కల్పిస్తారు.
*  ప్రస్తుతం ఉన్న మంత్రుల క్వార్టర్లనే ఇరు రాష్ట్రాల మంత్రులకు కేటాయిస్తారు. ఇష్టం వచ్చినట్లు మంత్రుల సంఖ్యను పెంచుకోవడానికి అవకాశం లేనందున ప్రస్తుతానికి ఉన్న క్వార్టర్లే మంత్రులకు సరిపోతాయి.
*  ప్రస్తుతం హైదర్‌గూడలోని పాత ఎమ్మెల్యే క్వార్టర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేలకు, ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్లను తెలంగాణ ఎమ్మెల్యేలకు కేటాయిస్తారు.
 
*  విద్యుత్ సౌధ, జలసౌధ, సంక్షేమ భవన్, బూర్గుల రామకృష్ణారావు భవన్‌తో పాటు ఇతర అన్ని శాఖలు, డెరైక్టరేట్ కార్యాలయాలను జనాభా ప్రాతిపదికన లేదంటే వెసులుబాటు ప్రకారం రెండు రాష్ట్రాల ఉద్యోగులకు కేటాయిస్తారు. విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటుకు ఆరు నెలలు సమయం ఉన్నందున తరువాత నిర్ణయం తీసుకుంటారు.

మరిన్ని వార్తలు