ఎవరి బాధ్యతలు వారే..

3 Jun, 2014 01:03 IST|Sakshi
ఎవరి బాధ్యతలు వారే..

ఎవరికి వారే చార్జ్ తీసుకున్న ఇరు రాష్ట్రాల డీజీపీలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రానికి చివరి డీజీపీగా వ్యవహరించిన ప్రసాదరావు సోమవారం రెండు రాష్ట్రాల డీజీపీలకు బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా.. ముందుగానే ఆయన వైదొలగడంతో సాధ్యం కాలేదు. సాధారణం గా డీజీపీగా పని చేస్తూ బదిలీ అయిన, పదవీ విరమణ పొందిన అధికారులు తమ బాధ్యతల్ని ఒక్కరికే అప్పగిస్తారు. కానీ, ఈసారి ప్ర సాదరావు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డీజీపీలకు బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. అయితే దీని కి ముందే సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో బాధ్యతల స్వీకారం, అప్పగింతలకు సంబంధించిన చార్జ్ డైరీని తన నివాసానికి తెప్పించుకున్న ప్రసాదరావు తాను రిలీవ్ అవుతున్నట్లు సంతకం చేశారు.
 
 ఆపై సచివాలయానికి వెళ్లి ఆంధ్రప్రదేశ్ హోం శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ డీజీపీకి కేటాయించిన సీఐడీ భవనంలో జేవీ రాము డు, ప్రస్తుత డీజీపీ కార్యాలయంలో అనురాగ్‌శర్మ ఎవరికి వారే బాధ్యతల్ని స్వీకరించారు. ఎవరికి వారు తమ చాంబర్స్‌లోకి వెళ్లి సహాయకుల ద్వారా చార్జ్ డైరీలో బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సంతకాలు చేశారు.
 
 గుంటూరులో డీజీపీ క్యాంప్ కార్యాలయం!
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ క్యాంపు ఆఫీస్ గుంటూరులో ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రా జధాని విజయవాడ-గుంటూరు మధ్య ఉండనుంద ని, నాగార్జున వర్సిటీలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకానుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ చుట్టుపక్కల్లోనే డీజీపీకి క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.

మరిన్ని వార్తలు